మైచౌంగ్ తుఫాను రాష్ట్ర చరిత్రలో అపూర్వమైన వరదను సృష్టించింది మరియు కోట్లాది ప్రజలను కష్టాలను తెచ్చిపెట్టింది.

– కమల్ పిలుపు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మక్కల్ నీదిమయం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మైచౌంగ్ తుపాను ప్రళయం సృష్టించి కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన వరద బాధితులకు సహాయ పంపిణీని ప్రారంభించారు. వరద బాధితులకు సాయం అందించే వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో భారీ వర్షాలు కురిశాయని, మైచౌంగ్ తుపాను ప్రభావంతో 24 గంటల వ్యవధిలో 56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై వరద ఉధృతిని సృష్టించిందన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన అవసరాలను మనమే తీర్చుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం మంచిది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
బాధితులకు ఆహారం పంపిణీ
వేలచ్చేరిలో భారీ వంటశాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆహారాన్ని తయారు చేసి వరద బాధితులకు పంపిణీ చేస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కమల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్కల్ నీదిమయం ఉపాధ్యక్షుడు మౌర్య, ప్రధాన కార్యదర్శి అరుణాచలం, పార్టీ నాయకులు సెంథిల్ ఆర్ముగం, మురళీ అబ్బాస్, ప్రముఖ సినీ గేయ రచయిత స్నేహన్ తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-09T08:44:15+05:30 IST