
జార్ఖండ్ కొత్త సీఎంగా కల్పనా సోరెన్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను అరెస్ట్ చేస్తే తన భార్యను ముఖ్యమంత్రిని చేయాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లు సమాచారం. భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేతలతో హేమంత్ సోరెన్ భేటీ అయ్యారు. జైలుకు వెళితే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.
కల్పనా సోరెన్ ఏం చదివారు?
ఈ నేపథ్యంలో కల్పనా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన కల్పన ఫ్యాబ్రికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌తో పాటు MBA డిగ్రీని కూడా కలిగి ఉంది. ఆమె ఫిబ్రవరి 2006లో హేమంత్ సోరెన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్పనా కుటుంబం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించినది. ద్రౌపది మూర్ము కూడా మయూర్‌భంజ్ జిల్లాకు చెందినది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు జేఎంఎం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్?
విశ్వాసం ముఖ్యం
43 ఏళ్ల కల్పన తన భర్తతో కలిసి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఆమె ఎప్పుడూ తన భర్తకు వెన్నుదన్నుగా నిలబడేది. రాష్ట్రాభివృద్ధికి తన భర్త, తానెప్పుడూ పాటుపడతామని ఓ సందర్భంలో చెప్పారు. మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181ని మరింతగా ఎలా రూపొందించాలనే దానిపై ఇటీవల చర్చించినట్లు వెల్లడించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కల్పన ఎప్పుడూ చెబుతుంది. ఒడిశాలో గతేడాది ఏప్రిల్‌లో ఓ కాలేజీ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. ‘‘జీవితం తలకిందులైనా, ఆత్మవిశ్వాసం మనల్ని కాపాడుతుంది. డిగ్రీ అయినా, రాజకీయ నాయకుడైనా, ఐఏఎస్ అధికారి అయినా, పోలీసు అధికారి అయినా.. ఆత్మవిశ్వాసం లోపిస్తే గెలిచే పరిస్థితిలో కూడా ఓడిపోతారు’’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.