– అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి
పెరంబూర్ (చెన్నై): కొడనాడు హత్య, దోపిడీ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రశ్నించారు. బుధవారం ఉదయం మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న ఈపీఎస్.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ మధురై మహానాడును, విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి మీనాక్షిని దర్శించుకునేందుకు మదురై వచ్చినట్లు తెలిపారు. కొడనాడు హత్య, దోపిడీ కేసుకు సంబంధించి డీఎంకే అధికార దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలపై పలువురు ప్రశ్నిస్తున్నారని, ఈ విషయమై తాను ఇప్పటికే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నించానని గుర్తు చేశారు. శాసనసభ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి మౌనంగా ఉంటున్నారని అన్నారు. కొడనాడు హత్య, దోపిడీ నిందితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానిదేనన్నారు. కానీ, డీఎంకే లాయర్లు, ఎంపీ సాయంతో నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి బెయిల్ ఇచ్చిన వారు కూడా డీఎంకేకు చెందినవారేనని ఆరోపించారు.
కొడనాడు హత్య, దోపిడీ కేసును సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని కొందరు విమర్శిస్తున్నారని, అధికారం చేపట్టి 27 నెలలు గడుస్తున్నా మహిళలకు రూ.వెయ్యి ఇస్తామని సీఎం ప్రకటించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఎందుకు తగ్గించడం లేదని నిలదీసిన ఆయన.. రాష్ట్రాన్ని కాపాడలేని వారు దేశాన్ని కాపాడేందుకు బయలు దేరారని పరోక్షంగా సీఎంను దూషించారు. కోర్టు తీర్పు ప్రకారం కూడా కావేరీ జలాలను వెలికితీయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్నాడీఎంకే ఎప్పుడూ ఏ పార్టీకి బానిస కాదు. పదవుల కోసం బానిసలుగా మారేది డీఎంకే పార్టీయేనని అన్నారు. కర్ణాటకకు వెళ్లిన ముఖ్యమంత్రి కావేరీ జలాలు విడుదల చేయమని అడగకుండా ఇక్కడికి వచ్చి నేను డెల్టా వాసినని కపట నాటకాలు ఆడారని విమర్శించారు. కావేరి డెల్టా ప్రాంతాల్లో పంటల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మధురై చేరుకున్న పళనిస్వామికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్లూర్ రాజు, ఆర్బీ ఉదయ్‌కుమార్, ఎమ్మెల్సీ రాజన్ చెల్లప్ప, మాజీ ఎమ్మెల్యే శరవణన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఈపీఎస్‌కు చిత్రపటాన్ని అందించారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-31T08:26:32+05:30 IST