‘చాంగురే బంగూర రాజా’ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబ సమేతంగా హాయిగా వీక్షించవచ్చు…

‘చాంగురే బంగూర రాజా’ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబ సమేతంగా హాయిగా వీక్షించవచ్చు. నవ్వించే చిత్రమిది’ అని హీరో కార్తీక్ రత్నం అన్నారు. హీరో రవితేజ నిర్మిస్తున్న, కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటించిన ‘చాంగురే బంగారురాజా’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
రంగు రాళ్ల నేపథ్యంలో
కొన్ని కొండ ప్రాంతాలలో రంగు రాళ్లు కనిపిస్తాయి. కానీ అవి నిషేధిత ప్రాంతాలు. అయితే కొందరు రిస్క్ తీసుకుని రంగురాళ్ల కోసం తవ్వుతున్నారు. ఆ నేపథ్యంలోనే మా సినిమా కథ ఉంటుంది. ఇందులో నాలుగు ముఠాలు ఉంటాయి. దాదాపు సినిమా అంతా ఈ ముఠాల వెంటే సాగుతుంది. సతీష్ ‘నారప్ప’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. మేమిద్దరం రెండు నెలల పాటు సన్నిహితంగా ప్రయాణించాం. అప్పుడే ఈ కథ చెప్పాడు. ఆ కథ చేయడానికి రవితేజగారు ముందుకు వచ్చారని తెలిసి చాలా సంతోషించాను.
పదేళ్లయింది
రంగస్థలం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. చిన్న వయసులోనే తొలి నాటకానికి నంది అవార్డు అందుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి రవితేజ, నాని లాంటి వాళ్లే స్ఫూర్తి. రవితేజ నిర్మించిన అలాంటి సినిమాలో నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే దర్శకుడు సతీష్ వర్మ రచన చాలా బలంగా ఉంది. అలాగే ఆన్-స్పాట్ ఇంప్రూవైజేషన్ కూడా బాగుంది. ఈ సినిమాలో మెకానిక్ బంగార్రాజు పాత్రలో నటించాను. డబ్బు కోసమే పని చేసే రకం. ఇంతకు ముందు సీరియస్ రోల్స్ లో మాడ్యులేషన్, డైలాగ్స్, లుక్, వాయిస్ అన్నీ సీరియస్ గా ఉండేవి. అయితే ఇందులో నేను నిజజీవితంలో ఎలా ఉంటానో అదే పాత్రలో నటించాను.
నవీకరించబడిన తేదీ – 2023-09-13T00:18:58+05:30 IST