– నేతల మధ్య ఐక్యత ఉందా?
– జిల్లా నేతల సభలో స్టాలిన్ వేదన
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తాము అధికారంలో ఉన్నామని ఆలోచించకుండా కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు ముష్టిఘాతాలకు పాల్పడుతున్నారని, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో చెన్నైలో పార్టీ వివిధ జిల్లాల శాఖల నాయకులుగా పనిచేస్తున్న మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, దామో అన్బరసన్, సిత్రరాసు, మాధవరం మూర్తి, ఇళయ అరుణ సహా 72 మంది జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. రానున్న లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, రాష్ట్రంలోని 39 నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి జిల్లా నేతల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, నిధుల కొరత లేదన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీలో ఐక్యత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెన్కాశిలో జర్నలిస్టుల ఎదుటే స్థానిక నేతలతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
తనకు అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు ఎప్పటికప్పుడు తెలుసనే విషయం మరిచిపోయి జిల్లా శాఖల నేతలకు ఇలా కొట్లాడటం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మంత్రి మస్తాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో కూడా పార్టీ నేతలే ఇరకాటంలో పడ్డారని, వారికి సర్దిచెప్పే ప్రయత్నంలో మంత్రి మీడియా ముందు దిగడం శోచనీయమన్నారు. మంత్రుల చేతిలో మైక్ ఉందన్న స్పృహ లేకుండా పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ అందరికీ చెందుతుందని, ప్రతి ఒక్కరూ తమ భావాలను నిర్భయంగా చెప్పవచ్చని, అయితే ఈ విషయాలను ముందుగా పార్టీ సీనియర్లకు లేదా నాయకత్వానికి తెలియజేయాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ సీనియర్ నాయకులు, వివిధ శాఖల నాయకులు, శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా శాఖల నాయకులు, యూనియన్ శాఖల నాయకులు ఇప్పటి నుంచే పార్టీ, కూటమి అభ్యర్థుల్లో చేరాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-06T09:13:04+05:30 IST