పరీక్షల ఫలితాలు వెలువడి నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన లాంగ్ మెమోలను ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. వివిధ కోర్సుల్లో చేరారు

వేచి చూస్తున్నా!
పదో మెమోలు ఇంకా రాలేదు
ఫలితాలు ప్రకటించి ఇప్పటికే నాలుగు నెలలు కావస్తోంది
మరో 10 రోజుల్లో జారీ చేస్తాం
రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ స్పష్టీకరణ
హైదరాబాద్ , నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పరీక్షల ఫలితాలు వెలువడి నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన లాంగ్ మెమోలను ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ మెమోల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 30న ప్రకటించిన ఫలితాల్లో దాదాపు 4.53 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల ఫలితాలు కూడా సెప్టెంబర్ 1న ప్రకటించగా.. అందులో 38 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు దశల పరీక్షల్లో ఉత్తీర్ణులైన సుమారు 4.91 లక్షల మంది విద్యార్థులకు విద్యాశాఖ లాంగ్ మెమో జారీ చేయాల్సి ఉంది.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వెంటనే చిన్న మెమో జారీ చేయబడుతుంది. వీటి ఆధారంగా విద్యార్థులు ఇంటర్ లేదా ఇతర కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత పూర్తి నిడివి (పొడవైన) మెమో ఇవ్వబడుతుంది. ఈ మెమోలను ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించాల్సి ఉంటుంది. వీటిని ప్రింట్ చేయడానికి కొంత సమయం పట్టడం మామూలే. అయితే… ఈ ఏడాది లాంగ్ మెమోల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడం గమనార్హం. చాలా మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను సమర్పించాలి. అలాంటి వారందరికీ లాంగ్ మెమోలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా, పదో తరగతి విద్యార్థులకు వచ్చే 10 రోజుల్లోగా మెమోలు అందజేస్తామని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు, రీ వెరిఫికేషన్, చేర్పులు, మార్పులను తనిఖీ చేయడం వల్ల ప్రింటింగ్‌లో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. మెమోలు ముద్రించాలని ఆదేశాలు జారీ చేశామని, విద్యార్థులు తమ పాఠశాలల్లో తీసుకోవచ్చని తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2022-11-05T14:10:41+05:30 IST