దీంతో టీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలు అయోమయంలో పడ్డారు.
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీల అంతర్గత పోరు
ముందుగా గెలిచే ప్రత్యర్థి పార్టీలో చేరాలని భావించిన నేతలు
టీఆర్ఎస్ గెలుపొందడంతో ఇంకొన్నాళ్లు ఆగాలని నిర్ణయించుకున్నారట!
ఖమ్మం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): వీరంతా అధికార పార్టీకి చెందిన వారే. అయితే పార్టీలో అంతర్గత పోరు నెలకొంది. అవకాశం దొరికితే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల్లో ఏదో ఒక పార్టీని గెలిపించాలని కోరారు. గెలిచే పార్టీలో చేరాలన్నారు. కానీ, మునుపటి ఫలితం వారి ఆశలను నీరుగార్చింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో తెలియని అయోమయం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు టీఆర్ ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. కారు ఓవర్ లోడ్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వైరాలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
అయితే వీరి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో వారి చేతిలో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. వీరి హవా తగ్గి వలస ఎమ్మెల్యేలతో అంతా నడుస్తుండడంతో అంతర్గత పోరు నడుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం టీఆర్ ఎస్ వర్గాలుగా చీలిపోయాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొందరు మాజీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోని మాజీ ఎమ్మెల్యేలు, ఇతర అసంతృప్త నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం లోక్‌సభ స్థానానికి అప్పటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ దక్కలేదు. పొంగులేటి పార్టీ మారడం చాలా కాలంగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. వచ్చే ఎన్నికల్లో పొంగులేటికే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతున్నా.. ఆయన అనుచరులు నమ్మడం లేదు. మొన్నటి రిజల్ట్ ఆధారంగా పొంగులేటి నిర్ణయం ఉంటుందని అందరూ భావించినా.. ఆ ఫలితం విపక్షాలకు దక్కలేదు. దీన్ని బట్టి ఇప్పుడు పార్టీ మారే అవకాశం లేదని పొంగులేటి వర్గం ప్రచారం చేస్తోంది. వీరితో పాటు టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ పార్టీని వీడే పరిస్థితి లేదని, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలోగా నిర్ణయం తీసుకుంటారని ఆయా నేతల అనుచరులు పేర్కొంటున్నారు.