రాష్ట్రంలోని (తెలంగాణ) యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.

ప్రొఫెసర్ పోస్టులు
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ ఇప్పుడు కష్టమే!
రాష్ట్రపతి పరిశీలనకు అపాయింట్మెంట్ బోర్డు బిల్లు
ఆమోదం పొందిన తర్వాత పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది
హైదరాబాద్ , ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని (తెలంగాణ) యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. ‘ప్రొఫెసర్స్ అపాయింట్మెంట్ బోర్డు’ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపడంతో రాష్ట్రస్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందినా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించలేదని పేర్కొంటున్నారు. తెలంగాణలోని 11 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 2వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో బోధన కొనసాగుతోంది. గతంలో 2017లో 1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి జీఓ నెం.34 విడుదలైంది. ఇప్పటికీ ఈ నియామకాలు చేపట్టలేదు. ప్రొఫెసర్ల నియామకంలో ప్రమాణాలు పెంచేందుకు 2018లో యూజీసీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీల చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు.
నవీకరించబడిన తేదీ – 2023-04-13T11:08:21+05:30 IST