– రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన
– ట్రాఫిక్ నియంత్రణ కసరత్తు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ ఒత్తిడిని నివారించే దిశగా చేపట్టిన సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టును మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్ హైవేతో ఐటీ రాజధానికి, సాంస్కృతిక రాజధానికి మధ్య దూరం ఇప్పటికే బాగా తగ్గిపోవడంతో ఇటువైపు సబర్బన్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. దీంతోపాటు చిక్కబళ్లాపుర, కోలారు, తుమకూరు, రామనగర జిల్లాల్లోని పలు ప్రాంతాలను సబర్బన్ రైలు ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సబర్బన్ రైళ్లను నడిపేందుకు ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నైరుతి రైల్వే జోన్‌కు అనుమతి ఇవ్వాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సోమవారం లేఖ రాశారు. సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ (క్రైడ్) ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తొలిదశలో 148.17 కిలోమీటర్ల మేర సబర్బన్ రైలును నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జూన్ 6న జరిగిన సమావేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కే-రైడ్‌కు ప్రతిపాదనలు అందాయి.
ఈ ప్రతిపాదనల ఆధారంగా నైరుతి రైల్వే జోన్‌కు పలు సూచనలతో లేఖ రాసింది. తొలిదశ పనులు నిరంతరాయంగా కొనసాగిస్తూనే రెండో దశలో 452 కి.మీ విస్తరణ పనులు కూడా చేపడితే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉందని, చిన్నపాటి ర్యాలీలు, చిన్నపాటి వర్షం వల్ల పలు కీలక ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుందని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును కొంతమేర అదుపులోకి తెచ్చినా పూర్తి స్థాయిలో సాధ్యపడలేదని, సబర్బన్ రైళ్లతో ఈ సమస్యకు తెరపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ దేవనహళ్లి 41.4 కి.మీ, బైయప్పనహళ్లి నుండి చిక్కబాణవరానికి 25.01 కి.మీ, కెంగేరి నుండి వైట్ ఫీల్డ్ 35.32 కి.మీ, ఎలలిగ నుండి రాజనుకుంట 46.25 కి.మీ. మొదటి దశలో, మొత్తం 148 కిలోమీటర్ల సబర్బన్ రైలు మార్గం ప్రణాళిక చేయబడింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ మార్గంలో దేవనహళ్లి నుంచి కోలారు వరకు 107 కి.మీ, చిక్కబాణవర నుంచి దబ్సాపేట మీదుగా తుమకూరు వరకు 55 కి.మీ, చిక్కబాణవర నుండి మాగడి వరకు 45 కి.మీ, కెంగేరి నుండి మైసూరు వరకు 125 కి.మీ, వైట్ ఫీల్డ్ నుండి బంగారుపేట వరకు 45 కి.మీ. కిమీ, ఎల్లిగ నుండి తమిళనాడులోని హోసూరు వరకు 23 కి.మీ, రాజనుకుంట నుండి దొడ్డబళ్లాపుర మీదుగా గౌరిబిదనూరు వరకు 52 కి.మీ, సబర్బన్ రైళ్లను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి ఎంబి పాటిల్ తెలిపారు. మొదటి, రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. దరిమిలా రెండో దశ పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లకు అదనంగా మరికొన్ని రైల్వేలైన్లు నిర్మిస్తే ప్రభుత్వంపై అదనపు భారం ఉండదన్నారు. మొదటి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ఉందని మంత్రి వెల్లడించారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-26T13:03:51+05:30 IST