సాధారణంగా ఫారిన్ ప్రెస్‌లో మన భారతీయ సినిమాల ప్రస్తావన వస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. మన భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి ఎదిగిందని గొప్పలు చెప్పుకుంటున్నాం. అలాంటిది.. ఫారిన్ స్కూల్ బుక్స్‌లో భారతీయుడిపై పాఠం వేస్తే ఎలా? మనదురా అంటూ కాలర్ ఎగురవేస్తాం. ఇప్పుడు దేవ్ రాథోడికి అలాంటి అరుదైన గౌరవం దక్కింది. ఒకప్పుడు పొట్టకూటి కోసం వెయిటర్‌గా పనిచేసిన దేవ్ ఇప్పుడు చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా మారారు. జీరో నుంచి హీరోగా ఎదిగిన ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండడంతో అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠాన్ని చేర్చారు.
దేవ్ రాథోడి 1976లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ గర్వాల్ జిల్లాలోని కెమ్రియా సౌర్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి రైతు. చిన్నప్పటి నుంచి బ్రూస్‌లీకి వీరాభిమాని. ఆ అభిమానంతోనే దేవ్ కరాటే ఛాంపియన్ అవ్వాలని అనుకున్నాడు. కానీ.. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా తన కలను పక్కన పెట్టేశాడు. సుమారు పదేళ్లపాటు చిన్నాచితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. 2005లో రూ.10 వేల జీతానికి చైనాలోని ఇండియన్ రెస్టారెంట్ లో చేరాడు. అక్కడి నుంచి ఓ ప్రముఖ హోటల్‌లో మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఆదాయం పెరగడంతో చైనాలోని జియాన్ సిటీలో రెడ్ ఫోర్ట్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీజింగ్‌తో పాటు ఇతర నగరాల్లో శాఖలను ప్రారంభించాడు.
2016లో వ్యాపారంలో దూసుకుపోతున్న దేవ్ రాథోడికి ఓ ఆఫర్ వచ్చింది. రెస్టారెంట్‌కి వచ్చిన దర్శకుడు.. సినిమాల్లో నటిస్తాడా? అని అడగ్గానే.. దానికి సరేనన్నాడు. అలా ‘స్పెషల్ స్వాత్’ అనే చైనీస్ వెబ్ సిరీస్‌లో నెగిటివ్ రోల్‌లో నటించే అవకాశం వచ్చింది. అది పెద్ద హిట్ అయ్యి దేవ్ నటనకు మంచి పేరు వచ్చింది.. వరుసగా అవకాశాలు దక్కించుకున్నాడు. అతను ఇప్పటివరకు 35 చైనీస్ సినిమాలు మరియు సిరీస్‌లలో నటించాడు. వెయిటర్ నుంచి పాపులర్ యాక్టర్‌గా, బెస్ట్ సీఈవోగా ఎదిగిన నేపథ్యంలో.. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు షాంగ్సీ ప్రావిన్స్ దేవ్ స్ఫూర్తిదాయకమైన ఉనికిపై ఏడవ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల పాఠ్యాంశాలను తీసుకొచ్చింది.