కనిపించని ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారం
క్షేత్రస్థాయికి వెళ్లని 65 శాతం మంది..
పిల్లలతో కలిసి ఇంటి ముందు ఫోటోలు తీసి గ్రూప్లో అప్లోడ్ చేయండి
నీరుగారిన లక్ష్యం
హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో బడి మానేసిన విద్యార్థులు, బడి మానేసిన విద్యార్థులను బడిలో చేర్పించి వారిని చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన బడిబాట కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. సమగ్ర శిక్షాస్మృతి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇంటి వద్దనే గడుపుతున్నారు. మరికొందరు ప్రధానోపాధ్యాయుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇంటి చుట్టు పక్కల ఉన్న పిల్లల పేర్లను చేతులతో నమోదు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ సిద్ధాంతకర్త ‘ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్’ పేరిట ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 3 నుంచి 17 వరకు జరిగే కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని తమ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెంచేందుకు కృషిచేయాలన్నారు. జూన్ 3 నుంచి 9 వరకు ఎన్ రోల్ మెంట్ , జూన్ 12 నుంచి 17 వరకు పాఠశాలల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.రెండు వారాల బడిబాట కోసం ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.5000 బడ్జెట్ కేటాయించింది. కావున పాఠశాలల వారీగా బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి ఇంటింటికి ప్రచారం చేసి కొత్తగా నమోదు చేసుకోవాలి.
బంధువుల పిల్లల ఫోటోలను అప్లోడ్ చేయండి.
జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి పిల్లలను ఒప్పించి బడిలో చేర్చాలన్నారు. పాఠశాలలో చేరేందుకు అంగీకరించిన పిల్లల పేర్లు, వారి తల్లిదండ్రుల వివరాలతో పాటు వారి ఫొటోలను తీసి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో అప్ లోడ్ చేయాలి. అయితే వేసవి సెలవులు ముగియకముందే బడిబాట కార్యక్రమం నిర్వహించడం పట్ల కొందరు ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి చుట్టూ ఉన్న బంధువులు, పిల్లల ఫొటోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇలా నమోదవుతున్న పిల్లలంతా ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతుండటం గమనార్హం. 35 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎర్నింగ్ లీవ్స్ (ఈఎల్) ఇవ్వడం లేదు. పాఠశాల విద్యపై ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-06-06T14:09:26+05:30 IST