– జలుబు, గొంతు నొప్పి కూడా
– ఆసుపత్రుల వద్ద క్యూలో నిల్చున్న రోగులు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో వానలు, ఎండలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వాతావరణ వైపరీత్యాల కారణంగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు గొంతునొప్పి, జలుబు, కంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు రాకముందే నగరంలో దోమల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాల్లో మురుగు పేరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో నగరంలో డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. మొదట తుమ్ములు, ఆ తర్వాత జలుబు, గొంతునొప్పి ఈ జ్వరం ప్రధాన లక్షణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జ్వరపీడితులు నగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు వైద్యం కోసం బారులు తీరుతున్నారు. గత వారం నాలుగు రోజులుగా నగరంలో వర్షం కురిసింది. ఆ తర్వాత మే నెలను తలపించే విపరీతమైన ఉష్ణోగ్రతలతో నగరవాసులను ఎండలు భయపెడుతున్నాయి.
ఈ కారణంగా చల్లటి నీళ్లు తాగడం, ఏసీ గదుల్లో ఉండడం ఇప్పుడు సర్వసాధారణం. అదే సమయంలో జలుబు, దగ్గుతో బాధపడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మరికొందరు వైద్యులు ప్రస్తుత జ్వరం వైరస్ వల్ల వచ్చేది కాదని, ప్రత్యేక రకం జ్వరమని చెబుతున్నారు. పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరం కాకపోయినా సాధారణ జ్వరానికి ఇచ్చే మందులు, ఇంజక్షన్లు ఇస్తే ఈ రకం జ్వరాలు త్వరగా తగ్గవని చెబుతున్నారు. నగరంలో పలుచోట్ల వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద పెరుగుతోంది. వాటి కాటుతో జ్వరాలు కూడా పెరుగుతున్నాయని వివరించారు. నగరవాసులు దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్న ఆహారమే తినాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ సెల్వవినాయకం మాట్లాడుతూ జూలై, ఆగస్టు సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తాయని, ఈ సీజన్‌లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. అయితే నగరవాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరాలు వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రులకు వెళ్లి సకాలంలో వైద్యం అందిస్తే సరిపోతుందని అన్నారు. ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-05T07:33:26+05:30 IST