నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ‘విజయ్
– నియోజకవర్గాల వారీగా ఐటీ శాఖల ఏర్పాటు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అదే ఊపుతో విజయ్ తన మక్కల్ ఇయక్కం కమిటీ సభ్యులతో అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. జిల్లా స్థాయిలో 10వ, ప్లస్-2 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరినీ నగరానికి ఆహ్వానించి సుమారు 12 గంటలపాటు సమావేశం నిర్వహించి వారికి ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలు అందించిన విషయం తెలిసిందే. కార్యక్రమం అనూహ్యంగా విజయవంతం కావడంతో విజయ్ మక్కల్ ఇయక్కం నాయకులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మక్కల్ ఇయక్కం నేతృత్వంలో రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల మూడ్‌ని తెలుసుకునేందుకు ప్రత్యేక ఐటీ విభాగాలు ఏర్పాటు చేసేందుకు విజయ్ అడుగులు వేస్తున్నారు. అందుకోసం ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో అనుభవం ఉన్న 702 మందిని ఎంపిక చేశారు. ఈ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలను విజయ్ ఆహ్వానించి చర్చలు జరిపాడు. వీరందరినీ శనివారం ఉదయం పనయూర్‌లోని ఓ ప్రైవేట్ హాలులో విజయ్ కలవనున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కం కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మక్కల్ ఇయక్కం పరిధిలోని 1650 వాట్సాప్ గ్రూపులను బలోపేతం చేయడంపైనా దృష్టి సారిస్తామన్నారు. కొత్తగా జిల్లాల వారీగా ఏర్పాటైన ఐటీ శాఖలు ఏవిధంగా పనిచేయాలనే దానిపై విజయ్ సమగ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-08-25T08:21:00+05:30 IST