వచ్చే నెల 10వ తేదీలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అప్పటికి ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించేలా బీజేపీ నాయకత్వం యోచిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ: మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. మరోవైపు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారం, పది రోజుల్లో ఇరు పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కమలదళం అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పాలమూరులో ఎన్నికల శంఖారావ సభతో రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోదీ ప్రారంభించనున్నారు.
పాలమూరులో బహిరంగ సభ..
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలోని ఐటీఐ గ్రౌండ్స్ (అమిస్తాపూర్)లో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు దాదాపు 1.50 లక్షల మందిని తరలించేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాలమూరు పర్యటన అనంతరం మోడీ 3వ తేదీన మరోసారి తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న మోడీ నిజామాబాద్ లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అక్కడ బహిరంగ సభ ఉంటుందా లేక కేవలం రోడ్ షో మాత్రమే ఉంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు.
అగ్రనేతల వరుస పర్యటనలు
వచ్చే నెల 10వ తేదీలోగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అప్పటికి ప్రధాని మోదీతో పాటు పలువురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించేలా బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నాడాలతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఉమ్మడి పది నియోజకవర్గాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అగ్రనేతల సభలు నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.