రూ.100 కోట్ల వ్యయంతో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ 2024లో జియో, గోద్రెజ్ మరియు హ్యుందాయ్తో సహా పది ప్రముఖ కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

చెన్నై, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రూ.100 కోట్ల వ్యయంతో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ 2024లో జియో, గోద్రెజ్ మరియు హ్యుందాయ్తో సహా పది ప్రముఖ కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సదస్సు తొలిరోజే రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా ప్రకటించారు. చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో రెండు రోజులపాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఆ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జియో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తూ రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో తమిళనాడు జియో సంస్థ పరిశ్రమలను విస్తరిస్తుందని తెలిపారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ప్లాంట్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు తమిళనాడు రాష్ట్రం అనువుగా ఉందని కొనియాడారు. ఈ సదస్సులో కొత్త పరిశ్రమల స్థాపనకు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ కార్యక్రమాలకు హ్యుందాయ్ కంపెనీ రూ. 5600 కోట్లు, గోద్రెజ్ కంపెనీ రూ.515 కోట్లు, టాటా ఎలక్ట్రానిక్స్ రూ.12,082 కోట్లు, పెకాట్రాన్ కంపెనీ రూ.1000 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ రూ.10,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై దేశ ఆర్థిక ప్రగతిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 08, 2024 | 05:20 AM