నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టీ20
ఏడాది తర్వాత కోహ్లీకి తొలి మ్యాచ్
ఇండోర్: ఆదివారం ఇక్కడ భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచిన టీమిండియా రెండో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ రెండో టీ20కి సిద్ధమయ్యారు. అయితే ఏడాది విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తున్న విరాట్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. అఫ్గానిస్థాన్‌పై సిరీస్ విజయం సాధిస్తే.. జట్టులోని యువ క్రికెటర్లకు అది ఇచ్చే కిక్కే వేరు. కారణం.. సిరీస్ గెలిస్తే భవిష్యత్తులోనూ టీమ్ ఇండియాలో చోటు కోసం యువ ఆటగాళ్లు పోటీ పడేందుకు వీలవుతుంది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జరగనున్నందున సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలంటే రెండో మ్యాచ్‌లో జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. జట్టులో స్థానం కోసం ఇషాన్ కిషన్‌తో పోటీపడుతున్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చివరి రెండు మ్యాచ్‌లు కీలకం. అతను లోయర్ ఆర్డర్‌లో 30 కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నప్పటికీ, జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి జితేష్ ఇంకా పెద్ద స్కోర్ చేయాల్సి ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అరంగేట్రంలో ఆకట్టుకున్న హైదరాబాదీ తిలక్ వర్మ.. ఆ తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోతున్నాడు. భారత జట్టు దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగం కావాలంటే 21 ఏళ్ల తిలక్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంటుంది. అయితే విరాట్ అందుబాటులోకి రావడంతో తిలక్ తుది 11లో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లతో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ అదే జోరును కొనసాగించి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నాడు. పునరాగమనం చేసిన వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిని పక్కనపెట్టి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని అఫ్గానిస్థాన్ పట్టుదలగా ఉంది.
జట్లు (అంచనా)
భారతదేశం: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్/గిల్, విరాట్, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ (కీపర్), అక్షర్, సుందర్, కుల్దీప్/బిష్ణోయ్, అర్ష్‌దీప్, ముఖేష్/అవేష్.
ఆఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా (కీపర్), హజ్రతుల్లా/రమత్ షా, ఒమర్ జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్, ముజిబుర్ రెహ్మాన్, నివాన్ ఉల్ హక్, ఫరూకీ.
పిచ్/వాతావరణం
వికెట్ ఫ్లాట్‌గా ఉంది. చిన్న బౌండరీల వల్ల భారీ స్కోర్లు నమోదవుతాయి. మొహాలీలో వాతావరణం చాలా చల్లగా కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది.