తాడేపల్లి ఘటన దురదృష్టకరం, నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: హోంమంత్రిరాష్ట్రంలో ఎవరు నేరం చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉపేక్షించదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 12న తాడేపల్లిలో మైనర్ బాలిక హత్య జరిగిన గంటలోపే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. జగనన్న ప్రభుత్వంలో ఎవరు, ఎలాంటి తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.

తాడేపల్లిలో మైనర్ బాలిక హత్య బాధాకరమని, పోలీసు శాఖ సత్వర చర్యలు చేపట్టిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారని తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో హత్య చేస్తే.. గంజాయి తాగి హత్య చేసినట్లు ప్రతిపక్షాలు మభ్యపెడుతున్నాయని హోంమంత్రి వనిత అన్నారు.

వైఎస్సార్సీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు.. తమ హయాంలో మహిళల భద్రతకు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో పంచాయితీలు పెట్టి నిందితులకు కొమ్ముకాస్తున్నారే తప్ప బాధితులకు అండగా నిలబడలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే సకాలంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు సెటిల్మెంట్ చేశారు.

జగన్ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపిందని హోంమంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేయబోతున్నారని, గంజాయి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో మార్పు వచ్చిందని హోంమంత్రి తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని నిందించేందుకు మాటలు రాయడం, మాట్లాడడం సరికాదన్నారు.

రాజమండ్రిలో పుష్కరాల షూటింగ్‌కు వెళ్లి 29 మంది చనిపోతే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని హోంమంత్రి వనిత ప్రశ్నించారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో 11 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. నేరాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రతిపక్షాలు చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మాట్లాడటం మంచిది కాదని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *