క్యూ4లో 42 శాతం వృద్ధి నమోదైంది
నికర విక్రయాలు రూ.32,060 కోట్లు
ఒక్కో షేరుకు రూ.90 డివిడెండ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కంపెనీ రూ.2,671 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.1,876 కోట్ల లాభంతో పోలిస్తే, ఇది 42 శాతం వృద్ధిని నమోదు చేసింది. వాహన విక్రయాలతో పాటు ఆదాయంలో పెరుగుదల, సానుకూల విదేశీ మారకపు రేటు ఇందుకు దోహదం చేసింది. క్యూ4లో మారుతీ సుజుకీ నికర విక్రయాలు రూ.32,060 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.26,749 కోట్ల విక్రయాలను నమోదు చేసింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి, కంపెనీ రూ. 1,17,571 కోట్ల నికర అమ్మకాలపై రూ. 8,211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.లక్ష కోట్లు దాటడం ఇదే తొలిసారి. 2021-22లో ఆదాయం రూ.88,330 కోట్లు కాగా లాభం రూ.3,879 కోట్లు.
మరిన్ని విషయాలు..
మారుతీ సుజుకి గత ఆర్థిక సంవత్సరంలో తన వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.90 డివిడెండ్‌ను చెల్లిస్తుంది.
మార్కెట్లో కార్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా 10 లక్షల యూనిట్లు పెంచేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కంపెనీ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది.
ఈ జనవరి-మార్చి కాలంలో కంపెనీ మొత్తం 5,14,927 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన విక్రయాల కంటే 5.3 శాతం అధికం.
గత మూడు నెలల్లో దేశీయ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 7.1 శాతం పెరిగి 4,50,208 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా, ఎగుమతులు 64,719 యూనిట్లుగా నమోదయ్యాయి.
2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి, మారుతి సుజుకి అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి 19,66,164 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో 17,06,831 వాహనాలు దేశీయంగా విక్రయించగా, 2,59,333 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వార్షిక ఎగుమతులు.
బుధవారం బిఎస్‌ఇలో మారుతీ సుజుకీ షేరు ధర 0.26 శాతం పెరిగి రూ.8,503.15 వద్ద ముగిసింది.
నవీకరించబడిన తేదీ – 2023-04-27T01:11:06+05:30 IST