– మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలవుతున్న ప్రాధాన్యతా పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో పథకాల ఫలితాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. సచివాలయం సమీపంలోని నమక్కల్ కవింజర్ మాలిగై హాల్‌లో శుక్రవారం ఉదయం ఆయన ప్రాధాన్యతా పథకాల అమలుపై చర్చించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రత్యేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆ కేటగిరీలో గృహిణులకు ప్రతినెలా రూ.1000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పథకం వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలు తీరును అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక పథకాల అమలు మంత్రి ఉదయనిధి, మంత్రులు కెఎన్ నెహ్రూ, ఐ.పెరియసామి, ముత్తుసామి, దామో అన్బరసన్, రామచంద్రన్, పెరియకరుప్పన్, కయల్విలి సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, సహకార, స్థానిక సంస్థలు, హోం, మున్సిపల్, రెవెన్యూ, ఆది ద్రావిడ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాఠశాల పిల్లల అల్పాహారం, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ సహాయం, పుదుమైపెన్ పథకం, నాన్ ముదల్వన్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేపడుతున్న అభివృద్ధి పథకాలపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షించారు. జిల్లాల వారీగా ఒక్కో పథకం ఏ మేరకు అమలవుతుందో ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రాధాన్య పథకాలు వేగంగా అమలు కావడం లేదని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లు సకాలంలో ఆదేశాలు జారీ చేసి గ్రామాల్లో ప్రజలకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
451 మందికి నియామక ఉత్తర్వులు…
సచివాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నగర పాలక సంస్థ, నీటి సరఫరా శాఖల్లో విధి నిర్వహణలో మరణించిన 451 మందికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగ నియామక ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఆ మేరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లో 227 మందికి ఈ ఉత్వర్‌లు అందాయి. ఈ కార్యక్రమంలో నగరపాలక శాఖ మంత్రి కెఎన్ నెహ్రూ, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్ ప్రియా, కమిషనర్ డాక్టర్ జె రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-05T10:53:22+05:30 IST