టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా అమరావతికి రావడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ – చంద్రబాబు అరెస్ట్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో అమరావతికి రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆకస్మిక అమరావతి పర్యటన చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబును కలిసేందుకు సీఐడీ అధికారులు అనుమతిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్టును పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్థరాత్రి అరెస్టులు చేయడాన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు.
ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని సీనియర్ నేతలతో పవన్ భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్థితులపై జనసేన చర్చించనున్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్యాహ్నం తర్వాత చంద్రబాబును పోలీసులు విజయవాడకు తీసుకురానున్నారు. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇంద్రకీలాద్రికి నారా భువనేశ్వరి
కాగా, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చారు. భర్త చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భువనేశ్వరి, దుర్గమ్మ దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. భువనేశ్వరితో పాటు ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా ఉన్నారు. మరోవైపు విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య నేతలను ముందుగా అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్ర, రెండేళ్ల క్రితం అవినీతి జరిగితే చార్జిషీట్ ఏమైంది?: బాలకృష్ణ