ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (105), శుభ్‌మన్ గిల్ (104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచి వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను వణికించారు. తాజాగా గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఇది మంచి పరిణామం. సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న గిల్.. మరోసారి తన బ్యాట్ నుంచి పరుగుల వరద కురిపించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. దీంతో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా త్వరగానే తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో 8 పరుగుల వద్ద ఔట్ కావడం నిరాశపరిచింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 16 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే కంగారూలకు ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ధీటుగా బ్యాటింగ్ చేశారు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో టీమ్ ఇండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే జట్టు స్కోరు 9.5 ఓవర్లలో 79 పరుగుల వద్ద కాసేపు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో గిల్, శ్రేయాస్ ధీటుగా బ్యాటింగ్ చేశారు. దీంతో రన్ రేట్ తగ్గకుండా టీమ్ ఇండియా 8 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే భారత జట్టు 80 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న గిల్ కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అది కూడా 14వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ మార్కును చేరుకున్నాడు. గత మ్యాచ్ లోనూ గిల్ సిక్సర్ కొట్టి కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
హాఫ్ సెంచరీల తర్వాత గిల్, శ్రేయాస్ మరింత రెచ్చిపోయారు. గట్టిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యం సులువుగా 100 పరుగులు దాటింది. శ్రేయాస్, గిల్లను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు వేసిన వ్యూహాలన్నీ విఫలమయ్యాయి. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 158 పరుగులకు చేరుకుంది. ఆడమ్ జంపా వేసిన 30వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేశాడు. 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో శ్రేయస్‌కి ఇది 3వ సెంచరీ. కాగా గాయంతో చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో ఫామ్ లోకి రావడం ప్రపంచకప్ కు ముందు టీమ్ ఇండియాకు మంచి ఫలితమే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గిల్, శ్రేయాస్ మధ్య 200 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తయింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 31వ ఓవర్లో పేసర్ సీన్ అబాట్ ఛేదించాడు. ఆ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయాస్ బౌండరీ లైన్ వద్ద మాథ్యూ షార్ట్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 216 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. దీంతో కేవలం 163 బంతుల్లోనే 200 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అనంతరం శుభమన్ గిల్ కూడా 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో గిల్‌కి ఇది ఆరో సెంచరీ. అయితే గిల్ కూడా సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. గ్రీన్ వేసిన 35వ ఓవర్లో వికెట్ కీపర్ అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 243 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. గిల్ 97 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.