కావేరి డెల్టా జిల్లాల్లోని పంటల సాగుకు కావేరీ జలాలు విడుదల చేయాలని ఒకవైపు సుప్రీంకోర్టు, మరోవైపు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు తీర్పులు వెలువరించగా, చివరకు కర్ణాటక ప్రభుత్వం తలొగ్గింది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కావేరి డెల్టా జిల్లాల్లోని పంటల సాగుకు కావేరీ జలాలను విడుదల చేయాలని ఒకవైపు సుప్రీంకోర్టు, మరోవైపు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు తీర్పులు వెలువరించగా, చివరకు కర్ణాటక ప్రభుత్వం తలొగ్గింది. శనివారం ఉదయం కర్ణాటక రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం పట్టు సడలించి రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసింది. ఈ మేరకు కబిని డ్యాం నుంచి సెకనుకు 2,500 క్యూబిక్ అడుగుల చొప్పున, కృష్ణరాజసాగర్ డ్యామ్ నుంచి సెకనుకు 2,973 క్యూబిక్ అడుగుల చొప్పున మొత్తం 5,473 క్యూబిక్ అడుగుల చొప్పున కావేరీ నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో కూడా భారీగా పెరిగింది. కృష్ణరాజసాగర్లోకి సెకనుకు 5147 క్యూబిక్ఫీట్లు, కబినిలోకి 2796 క్యూబిక్ఫీట్ల చొప్పున నీరు వచ్చి చేరుతోంది. ఈ రెండు డ్యామ్ల నుంచి సెకనుకు 5,000 క్యూబిక్ అడుగుల చొప్పున పదిహేను రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కావేరి మేనేజ్మెంట్ బోర్డు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు డ్యామ్ల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో.. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కావేరీ జలాలు విడుదలయ్యాయని తెలియగానే డెల్టా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ రైతులంతా కావేరీ జలాల రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. తాము పండించిన వరి కళ్ల ముందే ఎండిపోతుందేమోనన్న ఆందోళనతో.
నవీకరించబడిన తేదీ – 2023-09-24T09:06:19+05:30 IST