టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై నారా లోకేష్ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా నిలుస్తున్న వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నేతలకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు, పార్టీ నాయకులు చేస్తున్న నిరసనలపై ప్రభుత్వం అణచివేసి కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో లోకేష్ యువగళం పునఃప్రారంభంపై కూడా చర్చించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిపోయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్నట్టు సమాచారం. అలాగే చంద్రబాబుపై అక్రమ కేసుకు సంబంధించి నారా లోకేష్ ఢిల్లీలో ఉంటూ న్యాయవాదులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. న్యాయపోరాటం కొనసాగిస్తూనే యువతతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ రాజకీయ కక్ష సాధింపు అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నేతలంతా టెలీకాన్ఫరెన్స్ లో నిర్ణయించారు.
మరోవైపు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ సహా మొత్తం 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు.