పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల కోసం రూ.60,000 కోట్ల గృహ రుణ వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2028 వరకు కొనసాగనున్న ఈ పథకంలో భాగంగా బ్యాంకులు కొన్ని నెలల్లో…

త్వరలో ప్రభుత్వం ప్రకటన!
రూ.9 లక్షల వరకు రుణ విలువపై 3-6.5 శాతం వార్షిక వడ్డీ రాయితీ
-
రూ.50 లక్షల లోపు రుణానికి అర్హత
-
పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాలకు వర్తింపు
-
25 లక్షల మంది వరకు ప్రయోజనం పొందవచ్చు
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల కోసం రూ.60,000 కోట్ల గృహ రుణ వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2028 వరకు అమలులో ఉన్న ఈ పథకంలో భాగంగా బ్యాంకులు కొన్ని నెలల్లో సబ్సిడీ గృహ రుణాలను మంజూరు చేయడం ప్రారంభించవచ్చని రాయిటర్స్ నివేదిక ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించనుండడం గమనార్హం. గత నెలలో కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది.
ఈ పథకంలో భాగంగా రూ.9 లక్షల వరకు రుణం విలువలో 3-6.5 శాతం వార్షిక వడ్డీ రాయితీని అందించనున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల కాలపరిమితి కలిగిన రూ.50 లక్షల కంటే తక్కువ రుణం తీసుకున్నవారు ఈ పథకం ద్వారా రాయితీని పొందేందుకు అర్హులని అధికారిక వర్గాలు తెలిపాయి. వడ్డీ రాయితీ సొమ్ము ముందుగా లబ్ధిదారుని గృహ రుణ ఖాతాలో జమ చేయబడుతుంది. దాదాపుగా ఖరారైన ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గానికి చెందిన 25 లక్షల మంది వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, పట్టణ అద్దెదారులు, ఆక్రమణదారులు మరియు అనధికారిక కాలనీలలో నివసించే వారికి ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ పథకంలో భాగంగా రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంకులకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ పథకం అమలుపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు త్వరలో బ్యాంకర్లతో సమావేశమవుతారని ఇద్దరు బ్యాంకు అధికారులు తెలిపారు. పథకం ప్రారంభానికి ముందే అర్హులైన లబ్ధిదారులను గుర్తించే పనిలో బ్యాంకులు ఉన్నాయన్నారు. ఈ పథకం ద్వారా అందుబాటు గృహాల రంగంలో రుణాల మంజూరు పెరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వం 2017-22లో పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల కోసం గృహ రుణ వడ్డీ రాయితీ పథకాన్ని కూడా అమలు చేసింది. ఈ పథకం కింద 1.227 కోట్ల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-26T01:18:44+05:30 IST