– ప్రశ్నించేందుకు ప్రజలంతా ముందుకు రావాలి: ప్రవాసుల పిలుపు
– హగరిబొమ్మనహాల్ లో చంద్రబాబుకు మద్దతుగా జోరుగా నిరసనలు
బళ్లారి (బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుట్రలతో అక్రమ కేసుల్లో ఇరికించారని ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హగరిబొమ్మనహాల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం హగరిబొమ్మనహాల్‌లో కమ్మసంఘం నాయకులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు వేముళ్లపల్లి సుబ్బారావు, ఎ.ఆంజనేయులు, ఎం.కాళేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జి.నాగరాజు, భాస్కర్‌రాజు తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. స్థానిక శివాలయం నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, రైతులు, తెలుగు, కన్నడ, కమ్మ సంఘాలు, వ్యాపారులు, స్థానిక తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు.
ర్యాలీ అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడ ప్రజలనుద్దేశించి వేమెళ్లపల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. జైల్లో పెట్టాల్సినంత తప్పు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడు చంద్రబాబు అని అన్నారు. అనేక మంది విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొంది ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చంద్రబాబును అభిమానించే వారు వేల సంఖ్యలో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలన్నారు. లేకుంటే జగన్ చేతుల్లో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లి ప్రజల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-27T10:40:49+05:30 IST