అక్టోబర్ 1, 2023 నుండి GST చట్టంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించిన వివరాలు మీ కోసం.
చిన్న, మధ్యతరగతి వ్యాపారుల సౌకర్యార్థం, జీఎస్టీ నిర్వహణను సులభతరం చేసేందుకు ‘కాంపోజిషన్ లెవీ’ అనే పథకం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీల ద్వారా విక్రయించే వ్యాపారులకు ఈ పథకం వర్తించదనే నిబంధన ఉంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన తొలగించబడింది. దీని ప్రకారం, కాంపోజిషన్ లెవీలో నమోదైన వ్యాపారవేత్తలు ఇకపై ఈ-కామర్స్ కంపెనీల ద్వారా కూడా అమ్మకాలు చేపట్టవచ్చు. అయితే ఈ సడలింపు కేవలం వస్తువులను విక్రయించే వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. సర్వీస్ సెక్టార్‌లోని వారికి ప్రస్తుతం ఉన్న రూల్ కొనసాగుతుంది.
అలాగే జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తే సంబంధిత జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రభుత్వాధికారులకు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రద్దు చేయబడిన GST రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడానికి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కాలపరిమితిని 90 రోజులకు పెంచారు. అంతేకాకుండా, కారణాలు సహేతుకమైనట్లయితే, సంబంధిత అధికారుల నుండి 180 రోజుల అదనపు కాలపరిమితిని కూడా పొందవచ్చు. మరో ముఖ్యమైన సవరణ ఏమిటంటే, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) హక్కుదారుడు GSTతో సహా 180 రోజులలోపు సంబంధిత ఇన్‌వాయిస్ మొత్తం విలువను సరఫరాదారుకు చెల్లించాలి. చెల్లించని పక్షంలో, వసూలు చేసిన ఇన్‌పుట్ పన్ను చెల్లదు. మునుపటి నిబంధన ప్రకారం, అటువంటి సందర్భంలో తీసుకున్న ITC, వడ్డీతో సహా, వచ్చే నెల (180 రోజుల తర్వాత) GSTR-3B రిటర్న్‌లో అవుట్‌పుట్ పన్ను బాధ్యతకు జోడించాల్సి ఉంటుంది. అంటే, చెల్లించాల్సిన పన్ను కింద ఐటీసీని కూడా చూపించి ఉండాలి. దీని వల్ల వడ్డీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఇప్పుడు ‘రివర్స్’ కింద కూడా ఈ సౌకర్యం కల్పించారు.
ఇంకా, కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, కంపెనీలు తమ నికర లాభంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద కొన్ని సేవా కార్యకలాపాలను చేయాలి. కార్యక్రమాలు నిర్వహించేందుకు అందించే వస్తువులు, సేవలపై ఐటీసీ తీసుకోవచ్చా అనే చర్చ జరిగింది. ఇప్పుడు ఇచ్చిన వివరణ ప్రకారం, అటువంటి వస్తువులు మరియు సేవలపై ITC తీసుకోబడదు.
రాంబాబు గొండాల