కుటుంబ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా స్పందించారు. రాహుల్ రాజకీయాలపై అవగాహన లేని నిరక్షరాస్యుడని, ఆయన చిన్న పిల్లాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీలో రాజకీయ నేతల కొడుకులు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు హిమంత కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు.
ఇంతకీ రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ నేతలు అదే స్వరం పెంచుతున్న తరుణంలో.. మిజోరం ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. అమిత్ షా కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? భారత క్రికెట్ని ముందుకు నడిపిస్తున్నాడని విన్నాను. అలాగే రాజ్నాథ్ సింగ్ కొడుకు ఏం చేస్తున్నాడు? కుటుంబ రాజకీయాలు మాపై చేసే ముందు.. తమ పిల్లలు ఏం చేస్తున్నారో బీజేపీ నేతలు తమను తాము ప్రశ్నించుకోవాలి. చాలా మంది బీజేపీ నేతల పిల్లలు కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండగా, రాజ్ నాథ్ సింగ్ కుమారుడు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై హిమంత స్పందన
అసలు కుటుంబ రాజకీయాల్లోకి అమిత్ షా కొడుకు ఎలా వచ్చాడు? ఆయన బీజేపీలో లేరు. కానీ.. రాహుల్ కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) బిజెపికి చెందిన వింగ్ అని రాహుల్ భావిస్తున్నారు. అతని గురించి నన్ను అడగవద్దు. అతను నిరక్షరాస్యుడైన చిన్న పిల్లవాడు. యూపీలో కేవలం ఎమ్మెల్యేగా ఉన్న రాజ్నాథ్ సింగ్ కుమారుడిని ప్రియాంక గాంధీ (కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి)తో పోల్చగలరా? ఆయన బీజేపీని నియంత్రిస్తారా?’’ అని రాహుల్ వ్యాఖ్యలకు హిమంత బదులిచ్చారు. రాహుల్కు రాజకీయాలపై అవగాహన లేదని, కుటుంబ రాజకీయాలకు తానే మూలమని గుర్తించడం లేదన్నారు. అమ్మ, నాన్న, తాత, చెల్లి, తమ్ముడు.. రాహుల్ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉంది.
కాంగ్రెస్ పార్టీ మొత్తం రాహుల్ కుటుంబ నియంత్రణలో ఉందని.. అలాంటి పార్టీని బీజేపీతో ఎలా పోల్చుతారని హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలపై రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అప్రస్తుతం అని అన్నారు. రాజకీయాలపై అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ను బీజేపీతో పోలుస్తున్నారన్నారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని, ఆపై కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. మరి.. కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2023-10-18T17:58:31+05:30 IST