T20 వరల్డ్ కప్ 2024: నేపాల్ పదేళ్ల తర్వాత ICC టోర్నమెంట్‌లో ఆడనుంది

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-03T18:53:54+05:30 IST

పదేళ్ల తర్వాత నేపాల్ ఐసీసీ టోర్నీకి అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ పోటీపడనుంది. పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండోసారి.

T20 ప్రపంచ కప్ 2024: నేపాల్ పదేళ్ల తర్వాత ICC టోర్నమెంట్‌లో ఆడనుంది

T20 ప్రపంచ కప్ 2024 కోసం ఆసియా జట్ల క్వాలిఫయర్స్ టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నేపాల్, యూఏఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ 8 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. దీంతో పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండోసారి. గతంలో 2014లో టీ20 ప్రపంచకప్ ఆడిన నేపాల్.. పదేళ్ల తర్వాత 2024లో జరిగే పొట్టి ప్రపంచకప్‌లో హేమాహేమీ జట్లతో రెండోసారి తలపడనుంది. 2024లో అమెరికా, వెస్టిండీస్‌లో T20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ICC ఇప్పటికే 12 జట్లను నేరుగా క్వాలిఫై చేసింది. వీటిలో ఆతిథ్య వెస్టిండీస్ మరియు అమెరికా జట్లతో పాటు ICC టాప్-10 జట్లు కూడా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ నేరుగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఐసీసీ ప్రకటించిన 12 జట్లతో పాటు మరో 8 జట్లను క్వాలిఫైయింగ్ పోటీల ద్వారా ఎంపిక చేస్తారు. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ మరియు కెనడా ఇప్పటికే క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించాయి. తాజాగా ఈ జాబితాలో నేపాల్‌, ఒమన్‌లు చేరాయి. యూఏఈతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. 135 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 17.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ హాఫ్ సెంచరీతో నేపాల్ బ్యాట్స్ మెన్లలో రాణించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు. అతనితో పాటు కెప్టెన్ రోహిత్ పాడెల్ కూడా 34 పరుగులతో రాణించాడు.

నవీకరించబడిన తేదీ – 2023-11-03T18:57:46+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *