రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్‌లో ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి.

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్‌లో ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనర్ 3,283 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకారం, ఇప్పటివరకు రూపిందర్ సింగ్‌కు 42,834 ఓట్లు రాగా, సురేంద్ర పాల్ సింగ్‌కు 39,951 ఓట్లు వచ్చాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది.
శ్రీగంగానగర్‌లోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ప్రభుత్వ కళాశాలలో 17 కౌంటర్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి జనవరి 5న పోలింగ్ జరగ్గా.. గతేడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న పోలింగ్ జరగ్గా.. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగానూ 199 నియోజకవర్గాలకు ఆ రోజు పోలింగ్ జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గుర్మీత్ సింగ్ కూనర్ కుమారుడు రూపిందర్ సింగ్ పోటీ చేశారు. ఇప్పటికే రాజస్థాన్ మంత్రివర్గంలో చేరిన సురేంద్రపాల్ సింగ్ బీజేపీ నుంచి రంగంలోకి దిగారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 08, 2024 | 01:27 PM