అయోధ్య: రామయ్యకు భారీ కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరిగే వేడుక కోసం కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తర్లు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమపువ్వు, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి. దీంతోపాటు 108 అడుగుల అగరబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల బరువైన దీపం, బంగారు పాదాలు, పది అడుగుల తాళం, 8 దేశాల సమయాన్ని తెలిపే గడియారం ఏకకాలంలో ట్రస్టుకు లభించాయి. నేపాల్‌లోని సీతమ్మ జన్మస్థలమైన జనక్‌పూర్ ధామ్ నుండి వెండి బూట్లు, నగలు, వస్త్రాలతో పాటు 3 వేలకు పైగా బహుమతులు కాన్వాయ్‌గా వచ్చాయి.

శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుండి ప్రత్యేక బహుమతిని తీసుకువచ్చింది. శుక్రవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలతో ట్రక్కు అయోధ్యకు బయలుదేరింది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలు పంపించారు. భక్తుల కోసం 7 వేల కేజీల రామ్ హల్వా సిద్ధం చేయనున్నట్లు నాగపూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి శ్రీరాముడికి బంగారు పూత పూసిన పాదుకలను సమర్పించేందుకు 8,000 కిలోమీటర్లు నడిచి అయోధ్య చేరుకున్నారు.

అంతా రామమయం!

అయితే రామమందిర వైభవం రాకముందే.. అయోధ్య మొత్తం రామమయంగా మారింది. శ్రీరాముడి పేరుతో మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు, రింగ్ టోన్లు, సోషల్ మీడియా హోరెత్తుతున్నాయి. అయోధ్య వీధులన్నీ ఆధ్యాత్మిక సౌందర్యంతో నిండి ఉన్నాయి. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు అయోధ్య జిల్లా మరియు నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్‌లు రిజర్వ్ చేయబడ్డాయి. ఎయిమ్స్ నిపుణులు స్థానిక ఆరోగ్య సంస్థల సిబ్బందికి అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో శిక్షణ ఇచ్చారు. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ఈ బెడ్లను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7 వేల మంది అతిథులను ఆహ్వానించారు. కాగా, అయోధ్యలో రామప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఉన్న ఖైదీలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఇలాంటివి మరిన్ని జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *