రాముని బంటులు : రాముని బంతులు!

రాముని బంటులు : రాముని బంతులు!

కోట్లాది హిందువుల కల సాకారమై అయోధ్యలో నిర్మించిన అద్భుతమైన రామమందిరంలో బాల రాముడు పూజలు చేస్తున్నాడు! కానీ.. అది అంత ఈజీ కాలేదు. రామజన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతో మంది చేసిన కృషి ఫలితంగా ఈ ఆలయం ఏర్పడింది. ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిని స్మరించుకునే సందర్భమిది.

లాల్ కృష్ణ అద్వానీ: రామజన్మభూమి ఉద్యమం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు.. ఎల్‌కే అద్వానీ! అంతకు ముందు ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం కోసం ఎందరో సాధువులు పోరాడినా.. ఆ అంశాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మార్చి ప్రజల్లోకి వెళ్లేలా చేసింది అద్వానీ. 1990లో టయోటా మినీ ట్రక్కును రథంగా మార్చి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్యలోని రామజన్మభూమి వరకు యాత్రను ప్రారంభించి విస్తృత మద్దతు పొందారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచి బీజేపీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో అద్వానీ రథయాత్ర కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

ప్రమోద్ మహాజన్: అయోధ్య ఉద్యమంలో భాగంగా అద్వానీ తొలుత సోమనాథ్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేపట్టాలని భావించారు. అయితే రాముడి రథం లాంటి రథంలో యాత్ర చేపడితే బాగుంటుందని, ప్రజల్లోకి బాగా వెళ్తుందని అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ సూచించారు. ఆయన ఇచ్చిన రథయాత్ర ఐడియా అద్భుతంగా వర్కవుట్ అయింది. ప్రయాణం విజయవంతమైంది.

అశోక్ సింఘాల్: 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విశ్వహిందూ పరిషత్ వందలాది మంది సాధువులు, హిందూ ప్రముఖులతో ‘ధర్మ సదస్సు’ నిర్వహించింది. రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అశోక్ సింఘాల్ ఉద్యమానికి ప్రధాన రూపశిల్పిగా మారి ముందుకు నడిపించారు. 1980లో రామజన్మభూమి ద్వారాలు తెరవడానికి రామజానకి రథయాత్ర నిర్వహించారు. ఆయన కృషి వల్లనే కరసేవ ఉద్యమం కూడా మొదలైంది. బాబ్రీ మసీదు గేట్లు తెరిచి.. అక్కడ గుడి కట్టాలని ఉద్యమానికి తెరతీశారు. ఆపై అద్వానీ దాన్ని ఎత్తుకున్నారు.

మురళీ మనోహర్ జోషి: అద్వానీ రథయాత్రలో ‘సెకండ్-ఇన్-కమాండ్’గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్జోషి. 1992లో మథురలో.. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమయ్యేలా కరసేవకులను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారన్న ఆరోపణలున్నాయి.

ఉమాభారతి: రెచ్చగొట్టే నినాదాలతో ప్రసంగాలు చేయడంలో దిట్ట. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆమె తన నినాదాలతో కరసేవకులను రెచ్చగొట్టారని లిబర్హాన్ కమిషన్ నిర్ధారించింది. పథకం ప్రకారం, ఆమె సిగ్నల్‌తో మసీదు కూల్చివేత ప్రారంభమైంది.

వినయ్ కతియార్: రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన బజరంగ్ దళ్ సంస్థకు వినయ్ కతియార్ తొలి అధ్యక్షుడు. ఫైర్ బ్రాండ్. ఇదిలా ఉంటే బాబ్రీ తాళాలు తెరిచి రాయి నిర్మాణానికి అనుమతించిన రాజీవ్ గాంధీ, మసీదు కూల్చివేత సమయంలో మౌనం వహించిన అప్పటి ప్రధాని పీవీ కూడా పరోక్షంగా ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

కళ్యాణ్ సింగ్: బాబ్రీ కూల్చివేత సమయంలో యూపీ సీఎం. 1991 జూన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ఆయన రామ్ లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన హయాంలో అక్కడ రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 1992లో, మసీదును కూల్చివేస్తున్న కార్మికులపై ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడానికి వారు నిరాకరించారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో అది అత్యంత కీలకమైన ఘట్టం.

– సెంట్రల్ డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *