తమిళనాడులోని రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు, కాంచీపురం జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆదివారం రాత్రి కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలకు మొదట ఈ-మెయిల్ వచ్చింది. ఆ తర్వాత సోమవారం ఉదయం మరో ప్రైవేట్ పాఠశాలకు ఫోన్ వచ్చింది. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన రెండు పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. రెండు పాఠశాలల్లో విచారణ ప్రారంభించారు. అయితే ఆ రెండు పాఠశాలల ఆవరణలో ఎలాంటి పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండూ బూటకపు బెదిరింపులని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ పనిలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుతం పాఠశాలల్లో 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. సరైన భద్రతా తనిఖీలు లేకుండా పాఠశాల ఆవరణలోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు.
అయితే ఇలాంటి బూటకపు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఫిబ్రవరి 8న చెన్నైలోని చాలా పాఠశాలలకు ఫిబ్రవరి 8న ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ టీమ్‌లు సోదాలు నిర్వహించి ఇవి బూటకపు బెదిరింపులు అని నిర్ధారించాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఇమెయిల్‌ను పంపడానికి ఉపయోగించిన ప్రోగ్రామ్ కోడ్‌ను పోలీసులు విజయవంతంగా గుర్తించగలిగారు కానీ బాధ్యులను గుర్తించలేకపోయారు.
మరింత జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి