అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో కొందరు గాయకులు తమ రామభక్తిని పాటల రూపంలో తెలియజేస్తున్నారు. వారి గాన ప్రతిభకు భక్తిని జోడించి..

PM Modi On Hariharan Ram Bhaja: అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన మహోత్సవం సమీపిస్తున్న వేళ… కొందరు గాయకులు రాముడి పట్ల తమ భక్తిని పాటల రూపంలో తెలియజేస్తున్నారు. తమ గాన ప్రతిభకు భక్తిని జోడించి రామభక్తిలో మైమరచిపోయేలా మధురమైన భక్తిగీతాలను విడుదల చేస్తున్నారు. ప్రముఖ గాయకుడు హరిహరన్ ఇటీవల రామ భజన కూడా పాడారు. ఈ పాటకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
రీసెంట్ గా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ రామభజనను ఎక్స్ వేదికగా కొనియాడారు. అందరినీ రామభక్తిలో ముంచెత్తుతుందని పేర్కొంటూ.. ఆ రామభజనను పంచుకున్నారు. “హరిహరన్ తన అద్బుతమైన రాగాలతో ఆలపించిన ఈ రామ భజన అందరినీ రామభక్తిలో ముంచెత్తుతుంది. మీరు కూడా ఈ అందమైన భజనను ఆస్వాదించండి” అని ఎక్స్ వేదికగా పేర్కొంటూ.. భక్తిగీతానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ను ప్రధాని మోదీ షేర్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.
గతంలో గుజరాతీ జానపద గాయని గీతా రబ్రీ భజన “శ్రీరామ్ ఘర్ ఏ”ని కూడా మోడీ ప్రశంసించారు. ఈ పాటను ఉద్వేగభరితంగా పేర్కొంటూ, “అయోధ్యలోని శ్రీరాముడి దివ్య ఆలయంలో రామలల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా నా కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని అన్నారు. అంతకుముందు.. స్వస్తి మెహుల్, జుబిన్ నౌటియాల్, హన్సరాజ్ రఘువంశీ, స్వాతి మిశ్రా పాడిన భక్తిగీతాలను కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రధాన కార్యక్రమం ప్రారంభమయ్యే వరకు ఏడు రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న ప్రధాన పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 09, 2024 | 03:07 PM