వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు దొంగిలించేందుకు దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విశాఖపట్నం
విశాఖపట్నం కేసు: విశాఖపట్నంలోని సుజాతనగర్‌లో 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ వెంకటేష్ హత్య చేసిన కేసులో కీలక మలుపు తిరిగింది. దీనిపై అధికారులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు వెంకటేష్‌ను జూలై 24న (24-07-2023) వాలంటీర్ విధుల నుంచి తొలగించినట్లు జివిఎంసి అధికారులు ప్రకటించారు. పాపయ్యపాలెం సచివాలయ కార్యదర్శి ఉమా మహేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. హత్య అనంతరం నిందితుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు జివిఎంసి జోనల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.
అసలు ఏం జరిగింది..
బంగారు గొలుసు కోసం ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. విశాఖపట్నంలోని 95వ వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి ఓ వృద్ధురాలిని హత్య చేసినట్లు తేలింది. ఈ దారుణం నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో చోటుచేసుకుంది.
సుజాతనగర్‌కు చెందిన కోటగిరి శ్రీనివాస్ పురుషోత్తపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనితో పాటు రాయవరపు వెంకటేష్ (26) పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేష్ ఆదివారం (జూలై 30) రాత్రి 10 గంటలకు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. అతను మళ్ళీ దుకాణానికి తిరిగి వచ్చాడు.
అర్ధరాత్రి 12.30 గంటలకు శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూడగా తల్లి వరలక్ష్మి మంచంపై పడి ఉండటాన్ని చూసి చలించిపోయాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో శ్రీనివాస్ తో కలిసి పనిచేస్తున్న వెంకటేష్ వచ్చి వెళ్లినట్లు నమోదైంది.
ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు దొంగిలించేందుకు దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ వార్డు వాలంటీర్‌గా పనిచేశాడు. కొన్ని కారణాల వల్ల వెంకటేష్‌ను ఈ నెల 24న విధుల నుంచి తప్పించినట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు.