న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అటాచ్ చేసింది. న్యూ ఫ్రెండ్ కాలనీలోని నివాస గృహంతో పాటు లాలూ కుటుంబానికి చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బీహార్ లో విలువైన భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్లు దర్యాప్తు సంస్థల ఆరోపణ. 2009లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.దీంతో లాలూ రైల్వే మంత్రి పదవిని కోల్పోయారు. ఈ కుంభకోణంపై అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ సీబీఐ విచారణకు ఆదేశించారు. తిరిగి 2021లో, ఈ కుంభకోణం బయటపడింది. ప్రాథమిక విచారణ అనంతరం లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లపై 2022లో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాలూ కార్యాలయం మెరిట్ ప్రాతిపదికన కాకుండా బంధుప్రీతి ప్రాతిపదికన నియామకాలు చేపట్టిందని విచారణలో తేలింది. రైల్వే మంత్రిగా లాలూ అధికార దుర్వినియోగం చేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు లబ్ధి చేకూరిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
2004-2009 మధ్య కాలంలో పాట్నాకు చెందిన చాలా మంది గ్రూప్-డి పోస్టుల్లో రిక్రూట్ అయ్యారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ పోస్టులకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదని, రిక్రూట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని పేర్కొంది. ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ వంటి వివిధ రైల్వే జోన్లలో అభ్యర్థుల రిక్రూట్మెంట్ జరిగిందని పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా లాలూ కుటుంబ సభ్యులు లక్ష చదరపు అడుగుల భూమిని కేవలం రూ.26 లక్షలకే సంపాదించారని, అయితే వీటి విలువ రూ.4.39 కోట్లకు పైగానే ఉంటుందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, పాట్నా, ముంబై, రాంచీలోని 24 ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో లెక్కలోకి రాని కోట్లాది రూపాయల నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-31T18:39:06+05:30 IST