చెన్నై, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులను కోరారు. గురువారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.178.91 కోట్లతో నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలందూరు మండలంలోని ఎంజీఆర్ రోడ్డులో రూ.71.31 లక్షలతో నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువను ఆయన పరిశీలించారు. హిందూ కాలనీ 4వ వీధి, ఎంజీఆర్ జంక్షన్ నుంచి నంగనల్లూరు వందడుగుల రోడ్డు, నంగనల్లూరు 47వ వీధి, ఆరో ప్రధాన రహదారి, కుబేర మునసామి రోడ్డు నుంచి వీరంగల్ వాగు వరకు 2.29 కిలోమీటర్ల మేర వర్షపునీటి కాలువ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం 1.78 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ పనులతోపాటు నగర వ్యాప్తంగా కాల్వల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌లో తనిఖీ…
వర్షపు నీటి కాలువల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్ పోరూర్ మార్గంలో పల్లవంతంగల్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఏప్రిల్ 12న ప్రారంభమైన పోలీస్ స్టేషన్ గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని హాజరు జాబితాను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పోరూరు చేరుకున్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పోరూరు చెరువు కుడికాలువకు ఆనుకుని 26మీటర్ల పొడవునా కప్పబడిన కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అశోక్‌నగర్‌కు వెళ్లి నాల్గవ ఎవెన్యూ తదితర ప్రాంతాల్లో రూ.7.60 కోట్లతో చేపడుతున్న వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మంత్రులు పొన్ముడి, దామో అన్బరసన్, మేయర్ ఆర్.ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సందీప్ సక్సేనా, కార్పొరేషన్ కమిషనర్ జె.రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి పనులు: CS
పెరంబూరు: ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి ముందే చెన్నై సహా శివారు ప్రాంతాల్లో వర్షపు కాలువల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా అధికారులను ఆదేశించారు. రుతుపవనాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షపు నీరు నిల్వ ఉండేందుకు స్థలం లేదని, కాల్వల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-04T08:44:37+05:30 IST