– టికెట్ ధర 30 శాతం పెరిగింది
చెన్నై, (ఆంధ్రజ్యోతి): పండగ, వారాంతపు సెలవులు వస్తే చాలు చెన్నైలోని ప్రైవేట్ కంపెనీల బస్సులన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడి ఛార్జీలను విపరీతంగా పెంచేస్తాయి. ప్రస్తుతం రెండో శని, ఆదివారాలు సెలవులు, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో నగరంలో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారంతా సోమవారం స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఎక్స్ ప్రెస్ రైళ్లు, ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో టికెట్ల రిజర్వేషన్ ఇప్పటికే ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఎగ్మూరు, సెంట్రల్ రైల్వే స్టేషన్ల నుంచి దక్షిణ జిల్లాల వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. కోయంబేడు నుంచి రోజూ నడిచే 2100 బస్సులతో పాటు రాష్ట్ర రవాణా సంస్థ 400 ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులు మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కోయంబత్తూర్, తెన్‌కాశి, తిరుప్పూర్, కుంభకోణం, తంజావూరు, సేలం, హోసూర్, ధర్మపురికి నడుస్తాయి. అదేవిధంగా తాంబరం, తిరువళ్లూరు, కాంచీపురం నుంచి 100 ప్రత్యేక బస్సులు కూడా దక్షిణాది నగరాలకు బయలుదేరాయి. ప్రస్తుతం రైళ్లు, ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించలేని వారందరూ ప్రైవేట్ బస్సుల్లో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇదే సమయంలో వరుస సెలవుల కోసం దక్షిణాది జిల్లాల వైపు వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడాన్ని గమనించిన ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు 30 శాతం వరకు ఛార్జీలను పెంచాయి. శుక్రవారం సాయంత్రం నగరంలోని ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు దొరక్క వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అదే సమయంలో పెరిగిన చార్జీలను గమనించి ఆందోళనకు గురయ్యారు. రద్దీ దృష్ట్యా బస్సుల యజమానులు శుక్రవారం సాయంత్రం నుంచి 30 శాతం ఛార్జీలు పెంచారు. ఏసీ బస్సుల్లో రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్లీపర్ సౌకర్యం ఉన్న మధురై, తిరునల్వేలి నగరాలకు వెళ్లేందుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఆడి మాసంలో ప్రయాణాలు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు తగ్గుతాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వరుస సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఛార్జీలను పెంచారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, పొల్లాచ్చి, ఈరోడ్ వెళ్లే ఓమ్నీ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-12T09:06:47+05:30 IST