తిరువళ్లూరు నుంచి చెన్నైకి వస్తున్న విద్యుత్ సబర్బన్ రైలు (లోకల్ రైలు) కోచ్ నుంచి పొగలు వచ్చాయి.
అడయార్ (చెన్నై): తిరువళ్లూరు నుంచి చెన్నైకి వస్తున్న విద్యుత్ సబర్బన్ రైలు (లోకల్ రైలు) కోచ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ఆ బోగీలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిరువళ్లూరు నుంచి ఆవడి మీదుగా చెన్నైకి సోమవారం ఉదయం 7.45 గంటలకు సబర్బన్ రైలు బయలుదేరింది. ఈ రైలు కొరట్టూరు స్టేషన్‌కు చేరుకుంది. విల్లివాక్కం వెళ్లిన కొద్ది నిమిషాలకే ఓ బోగీలో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో రైలును విల్లివాక్కం స్టేషన్‌లో నిలిపివేసి, ఆ బోగీలోని ప్రయాణికులు దిగిన తర్వాత బోగీని రైలు నుంచి వేరు చేసి షెడ్డుకు తరలించారు. ఆ తర్వాత మిగిలిన రైలు సెంట్రల్ స్టేషన్‌కు బయలుదేరింది. ఈ ఘటనతో దాదాపు గంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల పొగ వచ్చిందా? లేక మరో కారణమా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
నాగర్‌కోయిల్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
పెరంబూర్ (చెన్నై): నాగర్‌కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం ఉదయం నాగర్‌కోయిల్ జంక్షన్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో టాయిలెట్ గదిలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు స్టేషన్ ఆవరణ నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని గది తాళాలు తెరిచి చూడగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నాగర్‌కోల్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోజూ ఉదయం కూలీలు గదిలో ఉన్న పనిముట్లను తీసుకుని పనికి వెళుతున్నారు. వారు వచ్చేలోపే ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-29T07:13:04+05:30 IST