ముంబై: మరాఠా రిజర్వేషన్ల పరంపర ముదురుతోంది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో జాల్నాలో జరిగిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లాఠీచార్జి ఘటనపై ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం క్షమాపణలు చెప్పారు.
పోలీసులు లాఠీచార్జి చేయడం సరికాదు.. ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ తెలిపారు. ఇదిలా ఉండగా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరంగ్ పాటిల్‌తో మరాఠా రిజర్వేషన్ అంశంపై సీఎం అధ్యక్షతన చర్చించారు.
సానుకూలంగా పరిష్కరిస్తాం: సీఎం
మరాఠా రిజర్వేషన్ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని, నిరసనకారులతో ఇప్పటికే మాట్లాడామని, సమస్యను సక్రమంగా పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మరాఠా రిజర్వేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైనట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ఈ సమావేశంలో సీఎం, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ పాల్గొన్నారని పేర్కొంది. రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్, ఇతర మంత్రులు జల్నాకు వెళ్తున్నారని సీఎంఓ కార్యాలయం కూడా తెలిపింది.
జల్నా ఘటన దురదృష్టకరం: అజిత్ పవార్
కాగా, మరాఠా రిజర్వేషన్ అంశంపై జల్నాలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. రిజర్వేషన్ల అంశంపై సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించి శాంతిభద్రతలను ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నిరసనలు ఆపాలని, శాంతియుతంగా మాత్రమే నిరసనలు తెలియజేయాలన్నారు.
జల్నాలో ఏం జరిగింది?
మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌పై మనోజ్ జరంగే నేతృత్వంలో ఆగస్టు 29 నుంచి బైఠాయంపు నిరాహార దీక్ష కొనసాగుతోంది. అయితే, నిరాహార దీక్ష నుంచి ఆయనను తరలించేందుకు అధికారులు ప్రయత్నించడంతో గత శుక్రవారం నిరసన హింసాత్మకంగా మారింది. ఈ హింసాత్మక ఘటనలో తమ సిబ్బందితో సహా 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వి సుమారు 15 రాష్ట్ర రవాణా బస్సులు, కొన్ని ప్రైవేట్ వాహనాలకు నిప్పు పెట్టారు. జల్నాలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-04T17:55:28+05:30 IST