బీజేపీ నేతలు ‘రామరాజ్యం’ అనే పదాన్ని తరచుగా వాడటం అందరూ గమనించారు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.
బీజేపీ నేతలు ‘రామరాజ్యం’ అనే పదాన్ని తరచుగా వాడటం అందరూ గమనించారు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. తాము అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామని చెబుతున్నారు. మరి.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రామరాజ్యం ఉందా? లేదా? తెలియదు కానీ, ఈ పదాన్ని ఆ పార్టీ నేతలు వాడుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రామరాజ్యం స్థాపనకు ఊరికే మాట్లాడితే సరిపోదని పరోక్షంగా బీజేపీ నేతలను విమర్శించారు.
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అరుణా అసఫ్ అలీ ఆస్పత్రి ఓపీడీ భవనాన్ని అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. అక్కడ రోగులతో ముచ్చటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ఢిల్లీ ప్రభుత్వం వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 వేల పడకలున్నాయి. కొత్తగా 11 ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, పాత ఆసుపత్రులను మౌలిక వసతులతో మెరుగు పరుస్తున్నామన్నారు. 16,000 కొత్త పడకలు జతచేయబడతాయి. రాబోయే దసరా మరియు దీపావళి పండుగలను ప్రస్తావిస్తూ, వారు శ్రీరాముడిని పూజిస్తారని పేర్కొన్నారు.
కొందరు (బీజేపీని ఉద్దేశించి) రామరాజ్యం గురించి మాట్లాడుతున్నారు.. అయితే మనం ‘రామరాజ్యం’కి వచ్చామా? లేదా? అని చెప్పలేమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రామరాజ్యం ఏర్పాటు కావాలంటే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ మంచి విద్య, వైద్యం అందించాలని కోరుకుంటున్నానని.. ఢిల్లీలోని తమ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందని వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-23T22:31:09+05:30 IST