డెంగ్యూ: అమ్మో.. బాగా పెరిగింది.. రాష్ట్రంలో 4,227 మందికి డెంగ్యూ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): పారిశుద్ధ్య విధానాలు పాటించడం ద్వారానే డెంగ్యూ జ్వరాన్ని అరికట్టవచ్చని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం ఉదయం బిసెంట్‌నగర్‌లోని ఒడైమా నగర్‌లో డెంగ్యూ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వర్షాకాలంలో డెంగ్యూ, విరేచనాలు, టైఫాయిడ్ తదితర వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రజలు ఇళ్ల చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 2972 ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోజూ సేకరించిన రక్త నమూనాలను ల్యాబొరేటరీలకు పంపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23,713 మంది సిబ్బంది దోమల నిర్మూలన, డెంగ్యూ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. డెంగ్యూ, టైఫాయిడ్‌ జ్వర పీడితులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు నిల్వ ఉంచామన్నారు. నీలవేము, కబాసుర కషాయం, బొప్పాయి ఆకుల రసం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో 4,227 మంది డెంగ్యూ బారిన పడి చికిత్స పొందారని తెలిపారు. జ్వరపీడితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

నాని1.2.jpg

డెంగ్యూ దోమల ఉత్పత్తి కారకాలకు జరిమానా

పెరంబూరు: పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచే వారికి రూ.500 జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ఆరోగ్య బృందాలు ఆ ప్రాంతంలో మరెవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ దోమల నిర్మూలనను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచి డెంగ్యూ దోమల ఉత్పత్తికి కారణమయ్యే ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాల యజమానులకు నోటీసులు ఇస్తామని, లేని పక్షంలో రూ.500 జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో శుభ్రం చేస్తారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-23T07:35:21+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *