పంచాయతీ నిధులు కేంద్రం తిరిగి ఇవ్వగలదా?

కేంద్రం ఇచ్చిన నిధులను పంచాయితీలకు మళ్లించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వంపై విచారణకు కేంద్ర బృందం ఏపీకి రానుంది. పార్టీలకతీతంగా సర్పంచ్‌లు తమ నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఉద్యమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీకి వచ్చే కేంద్ర బృందం కీలకంగా మారింది. నిజానికి కేంద్ర బృందం పర్యటించాల్సిన అవసరం లేదు. ఇవేమీ నగదు లావాదేవీలు కావు. మొత్తం ఆర్బీఐ కనుసన్నల్లో ఉన్న ఖాతాల ద్వారానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నగదు జమ… సర్పంచ్ సంతకం లేకుండా డ్రా చేస్తే సైబర్ నేరం అవుతుంది. ఏపీ ప్రభుత్వం ఇక్కడ కూడా అదే చేసింది. పంచాయతీల ఖాతాల నుంచి నేరుగా డబ్బులు తీసుకున్నారు. పంచాయతీల్లో పనులు చేసేందుకు డబ్బులు లేవని… లక్షలు వెచ్చించి గెలిచిన సర్పంచ్ లు… నానా అవస్థలు పడుతున్నారు.

రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ పంచాయతీల కంటే మైనర్ పంచాయతీలే ఎక్కువ. ఇటీవల సాధారణ నిధులే కాకుండా 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని పంచాయతీ పాలకవర్గాలు వాపోతున్నాయి. నాలుగేళ్లలో 14, 15వ ఆర్థిక సంఘంలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు కేంద్రం రూ.7659 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ నిధులను పంచాయతీలు ఖర్చు చేసి యూసీలు సమర్పించాలి. ప్రభుత్వం పక్కదారి పట్టడంతో గ్రామ పంచాయతీలు ఖర్చు చేయలేకపోయాయి. ఈ పరిస్థితిపై కేంద్రానికి వరుస ఫిర్యాదులు అందడంతో కేంద్ర బృందాన్ని పంపుతున్నారు.

కేంద్ర బృందం… వచ్చి ప్రభుత్వ అజెండాపై పనిచేస్తే.. తమకు కావాల్సిన నివేదికను రాసి ఇస్తే… పంచాయతీలకు అన్యాయం చేసినట్లే. అయితే సర్పంచ్‌లు మాత్రం తమ గోడును ఆలకించి వాస్తవాలను కేంద్రానికి నివేదిస్తారని ఆశిస్తున్నారు. ఇక రాజకీయాల కోణంలో చూస్తే… కేంద్ర నిధుల దుర్వినియోగం అంశం తీసుకుంటే… వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి ఉండేదని అంటున్నారు. అందుకే ఇప్పుడు చర్యలు తీసుకుంటారని ఎవరూ అనుకోరు.

తెలుగు360 ఉత్తమ మరియు ప్రకాశవంతమైన జర్నలిస్టుల కోసం ఎల్లప్పుడూ తెరవబడి ఉంటుంది. మీకు పూర్తి సమయం లేదా ఫ్రీలాన్స్ పట్ల ఆసక్తి ఉంటే, మాకు ఇమెయిల్ చేయండి Krishna@telugu360.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *