వరుసగా పండుగలు, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఉన్నందున వచ్చే ఆరు నెలలు కీలకమని పోలీసులు చెబుతున్నారు

– నిఘా ముమ్మరం
– పోలీసు శాఖకు సీఎం ఆదేశం
– శాంతిభద్రతల సమీక్ష
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వరుస పండుగలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున వచ్చే ఆరు నెలలు చాలా కీలకమని, కాబట్టి పోలీసులు నిఘాను ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వచ్చే ఆరు నెలల్లో జిల్లా స్థాయిలో నిఘా విభాగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఆ శాఖ అందించే సమాచారాన్ని ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా ఉందని గత నెల రోజులుగా పత్రికలు, ఇతర మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాస్తవానికి గతేడాదితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని స్టాలిన్ వివరించారు. తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతోందని, మహిళలు అధికంగా తరలివచ్చే ప్రాంతాలు, పిల్లలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలన్నారు. అదేవిధంగా మహిళా పోలీసులు కూడా చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు కృషి చేయాలి. గంజాయి, ఇతర మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గత నాలుగు నెలల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన చర్యల వల్ల సారా తయారీని అరికట్టగలిగామని అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే ముందుండేలా పోలీసు అధికారులందరూ కలిసికట్టుగా పని చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి పి.అముద, డీజీపీ శంకర్ జివాల్, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్రయ్ రాథోడ్, తాంబరం పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్, అవడీ పోలీస్ కమిషనర్ కె. శంకర్ పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-27T07:57:55+05:30 IST