– ధర్మపురి ఆస్పత్రిలో చిన్నారి మృతి
అడయార్ (చెన్నై), (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ రకాల జ్వరాలతో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న డెంగ్యూ బాధితులు రోజుకు కనీసం 30 మంది ఉంటారని అంచనా. ప్రధానంగా రాజధాని నగరం చెన్నైతో పాటు తిరునెల్వేలి, తెన్‌కాశీ జిల్లాల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గత నెల నుంచి ఈ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. దీంతో అప్రమత్తమైన వైద్య వర్గాలు డెంగ్యూ జ్వరానికి కారణమైన దోమల వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారులను నియమించి తగు చర్యలు చేపట్టింది. ఒక్కో అధికారికి మూడు, నాలుగు జిల్లాలను కేటాయించి ఆయా జిల్లాల్లో డెంగ్యూ దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఈ ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి చెందింది
తిరుపత్తూరు జిల్లా శివరాజ్‌పేటకు చెందిన అభినిధి అనే చిన్నారి డెంగ్యూ జ్వరంతో ధర్మపురి ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందింది. శివరాజ్‌పేట ప్రాంతానికి చెందిన మణికంఠన్, సుమిత్ర దంపతులకు ప్రీతిక (15), తరణి (13), యోగలక్ష్మి (7), అభినిధి (4), పురుషోత్తమన్ అనే ఎనిమిది నెలల పాప మొత్తం ఐదుగురు ఉన్నారు. వీరిలో యోగలక్ష్మి, అభినిధి, పురుషోత్తమన్‌లకు డెంగ్యూ జ్వరం సోకింది. తొలుత తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, వారి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోవడంతో యోగలక్ష్మిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అభినిధిని ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో అభినిధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.