జేడీఎస్ అధినేత: ఖరారైంది… ఎన్డీయేతో చేతులు కలిపే ప్రసక్తే లేదు..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరబోనని, జేడీఎస్ లౌకిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. సోమవారం బెంగళూరులో పార్టీ మైనార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఏకపక్షంగా ఢిల్లీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారని, ఇందుకు తాను అంగీకరించబోనని చెప్పారు. తమిళనాడు, బీహార్, ఒడిశాలోని జేడీఎస్ యూనిట్లు కూడా బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. మిగిలిన కర్ణాటక శాఖలోనూ ఈ అంశంపై తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఇబ్రహీం పేర్కొన్నారు. జేడీ(ఎస్)కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో ఇదే అంశంపై చర్చించామని, వారిలో ఎక్కువ మంది బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మాజీ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని కుమారస్వామి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నపట్నంలో 20 వేల మంది ముస్లింలు ఓట్లు వేస్తేనే కుమారస్వామి గెలిచారని, ఈ వాస్తవాన్ని ఆయన గుర్తిస్తే బాగుంటుందని ఇబ్రహీం హితవు పలికారు. త్వరలో పార్టీ కోర్ కమిటీ సమావేశమై తదుపరి కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పార్టీ నేతలంతా ఇండియా అలయన్స్‌లో చేరాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ టీఏ శరవణ మాట్లాడుతూ.. మహాకూటమి సాధారణ సమావేశంలో బీజేపీతో పొత్తు విషయం చర్చకు వచ్చిందని, ఈ సమావేశంలో ఇబ్రహీం కూడా పాల్గొన్నారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం నగరంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇబ్రహీం వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

– కుమారస్వామి

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ సమ్మతితో విస్తృతంగా చర్చించిన తర్వాతే బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.

QQQQ.jpg

బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలైన జేడీఎస్ వారేనన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం వ్యాఖ్యలపై మండిపడ్డారు. కావాలంటే ఒరిజినల్ అని మెడలో బోర్డు వేలాడదీయాలి అని ఇబ్రహీంకు సూచించారు. ఇబ్రహీం వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తాను లేవనెత్తిన అంశాలపై స్పందించబోనని అన్నారు. గతంలో కుమారస్వామిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఇబ్రహీం లెటర్‌హెడ్‌పై మీడియా కార్యాలయాలకు సమాచారం అందింది. అయితే తన పేరు మీద లెటర్ హెడ్, నకిలీ సంతకం పెట్టారని ఇబ్రహీం జేసీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇబ్రహీంను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు దళపతి దేవెగౌడను కోరినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *