– నీటి ఆనకట్టలో 200 ఇళ్లు
– సత్తనూరు డ్యాం జలాల విడుదల
– మధురైలో కూలిన భవనం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): విరుదుగనర్, శివగంగ, రామనాథపురం, ఈరోడ్, మదురై జిల్లాల్లో సోమవారం కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐదు జిల్లాల్లోని పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కోస్తాంధ్రలో వీస్తున్న బలమైన గాలులకు తోడు ఈశాన్య రుతుపవనాలు బలపడడంతో గత నాలుగు రోజులుగా సాయంత్రం ఈ మూడు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. విరుదునగర్ జిల్లా రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూరు, వత్తిరిరుప్పు, సత్తూరు, విరుదునగర్, కరియాపటిల్‌లో రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా అయ్యనార్కోవిల్ వాగు, ముళ్లీయారు, పయనారు ప్రాంతాల్లో నీరు ప్రవహించింది. ఈ మూడు నదుల నుంచి వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు జిల్లాలోని పలుచోట్ల చెదురుమదురు వర్షం కురిసింది.
వరద
శ్రీవిల్లిపుత్తూరులో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మానసాపురం ముత్తుకరుప్ప నాడార్ వీధిలో ఓ ఇల్లు కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి శిథిలాల మధ్య చిక్కుకున్న వన్నియారాజ్ (62) అనే వృద్ధుడిని రక్షించారు.
శివగంగ జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిశాయి. శివగంగా నగర్, కళయార్‌కోవిల్, దేవకోట, తిరుభువనం, మనమదురై తదితర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామనాథపురం జిల్లాలో వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రామేశ్వరం ఆలయ దర్శనానికి వెళ్లిన భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధనుష్కోడి, బీచ్‌లో అలలు సాధారణ స్థాయి కంటే ఎగసిపడ్డాయి. పర్యాటకులు బీచ్‌లోకి రాకుండా కోస్ట్‌గార్డ్ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈరోడ్‌లోని కుంభవృష్టి…
ఈరోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చినుకులతో మొదలైన వర్షం పావుగంట తర్వాత కుండపోతగా మారింది. ఈరోడ్ నగరంలో భారీ వర్షం కారణంగా మేడువీధి, బస్ స్టేషన్, పెరియవలసు, వీరప్పన్ సత్తిరం, రైల్వేస్టేషన్, కరుంగల్‌పాళయం, నత్తర్మేడు, విల్లారసంపట్టి, అశోకపురం తదితర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈరోడ్‌లోని మోసికిరనార్ వీధిలోని 50 ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. అన్నై సత్యానగర్, మల్లినగర్ ప్రాంతంలోని 100 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షపు నీరు ఇళ్ల చుట్టూ ప్రవహిస్తోంది.