సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో భారీ అక్రమాలు చోటుచేసుకున్న వివాదం

– హైకోర్టు గ్రీన్ సిగ్నల్
– అభ్యర్థుల పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో భారీ అక్రమాల వివాదం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పరీక్షలను తిరిగి నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ధర్మాసనం కొట్టివేసింది. దీంతో మళ్లీ పరీక్షలకు మార్గం సుగమమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 545 ఎస్ ఐ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా కలబురిగి కేంద్రంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు బ్లూటూత్ వినియోగిస్తూ సమాధాన పత్రాల దిద్దుబాటులో జరిగిన అక్రమాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరీక్ష నిర్వహణాధికారిగా ఉన్న ఐజీ స్థాయి పోలీసు అధికారిని అరెస్టు చేశారు. సీఐడీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
పరీక్షల్లో అవకతవకలు జరిగినందున 545 ఎస్‌ఐ పోస్టులకు 2022 ఏప్రిల్ 29న మళ్లీ పరీక్షలు నిర్వహించాలని అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాము నిజాయితీగా పరీక్షలు రాశామని, మళ్లీ హాజరు కాలేమని ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించాలని కొందరు అభ్యర్థులు తొలుత కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలను ట్రిబ్యునల్ సమర్థించింది. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి వెంటనే పరీక్షలు నిర్వహించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా స్పష్టమవుతోందని, ఇప్పటికే పదుల సంఖ్యలో అభ్యర్థులు, సూత్రధారులు, పోలీసు అధికారులు అరెస్టయ్యారని, అదే పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టడం అసాధ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు రాష్ట్రంలో వివాదాలకు కేంద్రంగా నిలిచిన 545 ఎస్‌ఐ పోస్టులకు పునఃపరిశీలన అనివార్యమైంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-11T11:59:12+05:30 IST