ఒప్పందం: ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందం?

ఒప్పందం: ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందం?

100 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ ఓకే!

హమాస్ 70 మంది బందీలను విడుదల చేయనుంది

5 రోజుల పాటు కాల్పుల విరమణకు డిమాండ్

అల్-షిఫా ఆసుపత్రి మృతదేహంగా

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య ఒప్పందం ఉందా? చర్చల మధ్యవర్తిత్వం కోసం ఖతార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? హమాస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తామని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ బందీల విడుదల కోసం ఒక అడుగు వెనక్కి వేసిందా? గాజా, లెబనాన్ మరియు ఖతార్‌లలో పనిచేస్తున్న అనేక అరబిక్ వార్తాపత్రికలు ఈ ప్రశ్నలకు అవును అని కథనాలను ప్రచురించాయి. అంతేకాదు, చర్చలు దాదాపుగా సఫలమయ్యాయని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్‌ను ఉటంకిస్తూ అల్-హుర్రా వార్తా సంస్థ పేర్కొంది.

ఇజ్రాయెల్ జైళ్లలో బందీలుగా ఉన్న 200 మంది చిన్నారులు, 75 మంది మహిళలను విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. అయితే మహిళలు, పిల్లలు సహా 100 మందిని విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. మధ్యవర్తిత్వం ఫలించిందని ఖతార్ పేర్కొంది. బందీలను విడిపించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు అమెరికా కూడా తెలిపింది. మరోవైపు పాలస్తీనా ఖైదీల విడుదలతో పాటు ఐదు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తే.. తమ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. అయితే, ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

అల్-షిఫాలో పరిస్థితి దారుణంగా ఉంది

మూడు రోజులుగా అల్-షిఫా ఆస్పత్రిలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ట్యాంకులు మోహరించిన సంగతి తెలిసిందే..! అక్కడ అమానవీయ దృశ్యాలు కనిపిస్తున్నాయని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్‌కు చెందిన సర్జన్, ఏఎఫ్‌పీకి చెందిన ఓ జర్నలిస్టు వివరించారు. 100కు పైగా మృత దేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్లు పనిచేయకపోవడంతో 39 మంది శిశువులు మూడు రోజులుగా అల్లాడిపోయారని, వారిలో ఏడుగురు సోమవారం మరణించారని అల్-షిఫా వర్గాలు తెలిపాయి. ఆ ఏడుగురు పిల్లలతో పాటు 29 మంది రోగులు, 142 మంది పౌరుల మృతదేహాలకు మంగళవారం ఉదయం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఇంధనం లేకపోవడం, జనరేటర్లు పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తడంతో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద 300 లీటర్ల ఇంధనాన్ని ఉంచామని ఐడీఎఫ్ చెబుతోంది. ఆసుపత్రికి ఆ ఇంధనం రాకుండా హమాస్ కుట్ర పన్నిందని విమర్శించింది. కాగా, అల్-ఖుద్స్ ఆసుపత్రిలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు సెంట్రల్ గాజాలోకి తమ బలగాలు చొచ్చుకుపోతున్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది. గాజా పార్లమెంట్ భవనం, హమాస్ పోలీసు ప్రధాన కార్యాలయం, ఆయుధాగారం మరియు ఇంటెలిజెన్స్ కార్యాలయాలపై దాని బలగాలు దాడి చేశాయని పేర్కొంది.

కాశ్మీరీ యువతికి విముక్తి

గాజాలో చిక్కుకున్న కశ్మీరీ యువతి లుబ్నా నజీర్ షాబూ, ఆమె కూతురు కరీమా మంగళవారం గాజా నుంచి ఈజిప్ట్ చేరుకున్నారు. ఈ విషయాన్ని లుబ్నా భర్త నాదల్ తోమన్ ఫోన్‌లో చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఆమెను కైరో మీదుగా ఇండియాకు తీసుకురానున్న సంగతి తెలిసిందే.

(సెంట్రల్ డెస్క్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *