రాయ్‌బరేలీలోని ఫోర్జెడ్ వీల్స్ ఫ్యాక్టరీ కూడా 4,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది
కోల్‌కతా: విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) రుణ భారం మరియు నష్టాలను తగ్గించుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఏర్పాటు చేసిన ఫోర్జడ్ వీల్స్ ప్లాంట్‌తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని మిగులు భూముల్లో కొంత భాగాన్ని విక్రయించాలని భావిస్తోంది. ఈ సేల్ ద్వారా రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని ఆర్ ఐఎన్ ఎల్ సీఎండీ అతుల్ భట్ తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిధులు సమకూరితే వైజాగ్ స్టీల్ మళ్లీ నగదు లాభాల్లోకి వస్తుందని చెప్పారు.
మొత్తం 19,000 ఎకరాలు
విశాఖ ఉక్కు కోసం 19 వేల ఎకరాల భూమిని సేకరించారు. అందులో 6 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ కింద మిగిలాయి. మిగిలిన భూమిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్దఎత్తున ఉన్నాయి. 22.9 ఎకరాల్లో ఉన్న 588 ప్లాట్లు, రెండెకరాల్లో 76 నివాస గృహాలను విక్రయించడం ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందుకు కార్మిక సంఘాలు నో అంటున్నాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇస్తేనే స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభసాటిగా మారుతుందని అంటున్నారు.
రూ.23,000 కోట్ల అప్పులు
ఉక్కు ధరలు తగ్గుముఖం పట్టడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత రెండు మూడేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లోనూ రూ.3,000 కోట్ల నష్టాలను చవిచూసింది. రూ.23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్‌ఐఎన్‌ఎల్‌ను కుంగదీస్తున్నాయి. ఇనుప ఖనిజాన్ని బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే టన్నుకు రూ.6 వేల వరకు ఖర్చవుతుందని భట్ తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-15T02:12:15+05:30 IST