పార్లమెంటులో ఇద్దరు వ్యక్తులు సృష్టించిన గందరగోళం నేపథ్యంలో మరో పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భవనం దగ్గర పసుపు పొగను వెదజల్లుతున్న కంటైనర్లతో నిరసన తెలిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంటులో ఇద్దరు వ్యక్తులు సృష్టించిన గందరగోళం నేపథ్యంలో మరో పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భవనం దగ్గర పసుపు పొగను వెదజల్లుతున్న కంటైనర్లతో నిరసన తెలిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలం(42), అమోల్ షిండే(25)లను ట్రాన్స్పోర్ట్ భవన్ ఎదుట అదుపులోకి తీసుకున్నామని.. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అంతకుముందు.. మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బాష్పవాయు గోళాలను లోపలికి తీసుకుని సందర్శకుల గ్యాలరీ నుంచి నేరుగా లోక్‌సభ ఛాంబర్లోకి దూకి.. కలకలం సృష్టించారు.
ఈ ఘటనపై అమ్రోహా ఎంపీ కున్వర్ డానిష్ అలీ మాట్లాడుతూ.. టియర్ గ్యాస్‌తో పార్లమెంట్‌ను హడావిడి చేసిన ఇద్దరు వ్యక్తులు బీజేపీ నేత ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి పాస్‌లు పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహుశా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భద్రతా ఉల్లంఘన అని, గుర్తు తెలియని వ్యక్తులు పార్లమెంటులో వదిలిన పసుపు వాయువు విషపూరితమైనదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉండగా, 2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 13) లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 9 మంది అమరులయ్యారు. వీరు మరణించిన రోజే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి వెనుక అసలు కారణాలేంటి? ఎవరి హస్తం? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2023-12-13T15:22:07+05:30 IST